అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. పీక తెగినా రూల్స్ విరుద్ధంగా ప్రవర్తించబోనంటూ సభలో కోపంతో రగిలిపోయారు. సభలో మాట్లాడే అవకాశాలు ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు పోడియంను చుట్టిముట్టడంతో తమ్మినేని సీతారాం ఈ వ్యాఖ్యలు చేశారు. 

జాతీయ ఉపాధి హామీ పథకం నిధులపై చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అలాగే తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టిముట్టారు. స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారంటూ టీడీపీ శాసన సభ్యులు నినాదాలు చేశారు. తాను అందరికీ అవకాశం ఇస్తున్నానని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పుకొచ్చారు. అందరికీ అవకాశాలు ఇస్తున్నానని తనకు ప్రతిపక్ష పార్టీ అన్నా, ప్రతిపక్ష నాయుకుడు అన్నా ఎంతో గౌరవం ఉందన్నారు. 

ఎమ్మెల్యేలు పోడియంను వదిలి గౌరవ స్థానాల్లో కూర్చోవాలని కోరారు. అయినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఆగ్రహం చెందిన స్పీకర్ పోడియంను చుట్టిముడితే అవకాశాలు వస్తాయంటే అది పొరపాటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జగన్ తీరుతో వారు ఆత్మహత్య చేసుకునేలా ఉన్నారు: మాజీమంత్రి అచ్చెన్నాయుడు...

ఇలాంటి నిరసనలకు తాను లొంగనన్నారు. పీకపోయినా అవకాశం ఇవ్వనంటూ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం దగ్గర ఆందోళనలు చేస్తే అవకాశాలు వస్తాయని భావిస్తే అది సరికాదన్నారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. 

సభలో సభ్యతగా కూర్చుంటున్న ఎమ్మెల్యేలు ఏమైనా పనికిమాలిన ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ్మినేని సీతారాం. టీడీపీ ఎమ్మెల్యేలే తెలివైన వారు, ప్రజాసమస్యలపై పోరాడేవారని అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ తమ్మినేని. సభలో ఇలాంటి నిరసనలు సరికాదన్నారు. ఇలాంటి పద్ధతికి టీడీపీ ఎమ్మెల్యేలు స్వస్తి పలకాలని సూచించారు స్పీకర్. 

సభలో తన నియోజకవర్గం సమస్యలను ప్రస్తావించేందుకు మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నారని కానీ అవకాశం దొరకడం లేదన్నారు. ఇలాంటి పద్ధతుల వల్ల ఎవరూ ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఉందని ఇలాంటి పద్ధతులకు టీడీపీ ఎమ్మెల్యేలు ముగింపు పలకాలని కోరారు స్పీకర్ తమ్మినేని సీతారాం. 

దిశ చట్టం నాతోనే ప్రారంభించండి, తట్టుకోలేను: సభలో మహిళా ఎమ్మెల్యే ఆవేదన..