అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. 

అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున సభ్యులతో తన అనుభవాలను పంచుకున్న కోడెల తాను స్పీకర్ గా ఏ గ్రామానికి వెళ్లినా ఎక్కడకు వెళ్లినా చంద్రబాబు గురించే చెప్పుకునేవారని తెలిపారు. 

మహిళల విషయంలో అయితేనేమీ, యూత్ కు ఉపయోగపడే విషయంలో అయితేనేమీ, దళితులకు,గిరిజనులకు ఉపయోగపడే అంశాల్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలనే ప్రస్తావించేవారని తెలిపారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవింలో ఏనాడు ఇన్ని ఆర్థిక, రాజకీయ సమస్యలు చూడలేదన్నారు. 

నిధులు లేకపోయినా, వసతులు లేకపోయినా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మళ్లీ గెలిచి ఆసీట్ లో కూర్చోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే శాసన సభ్యులందరికీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

రాబోయే 70 రోజుల్లో ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ప్రజలు ఈ నాయకుడే మన సమస్యలు నెరవేరుస్తాడని భావించేలా ప్రతీ ఒక్కరూ కష్టపడాలని అందరూ గెలిచి మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోడెల శివప్రసాదరావు ఆకాంక్షించారు. 

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సభ్యులు మనమే మళ్లీ అధికారంలోకి రావాలంటూ స్లోగన్లు చేశారు. శాసన సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సందర్భంలో సభ్యులంతా చప్పట్లు  కొట్టి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అభినందనలు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మూడుసార్లు గైర్హాజరైతే డిజ్ క్వాలిఫై, వైసీపీ వాళ్లు 4 సమావేశాలకు రాలేదు: కోడెల శివప్రసాదరావు

శాసనసభాపతి పదవి ఉగాది పచ్చడిలాంటిది: స్పీకర్ కోడెల