అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్ లో తొలి అసెంబ్లీ స్పీకర్ గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతీ సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. ఆంధ్రప్రదేశ్ 13వ అసెంబ్లీ సమావేశాలు ముగింపు సందర్భంగా కోడెల శివప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 

నవ్యాంధ్రప్రదేశ్ లో తాను తొలిస్పీకర్ గా ఎంపికవ్వడం సంతోషంగా ఉందన్నారు. తనకు అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, ఏకగ్రీవానికి సహకరించిన వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ భవనాలు ఇతర భవనాల నిర్మాణాలు పూర్తికావస్తున్నాయని తెలిపారు. ఇలాంటి రాష్ట్రంలో స్పీకర్ గా అవకాశం రావడం అదృష్టమన్న కోడెల తాను ఈ పదవిని గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తనకు సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

శాసన సభాపతి పదవి అంటే ఉగాది పచ్చడిలాంటిదన్నారు. ఉప్పు, కారం, చేదు, అన్ని కలిసే ఉంటాయన్నారు. ఎన్నో విమర్శలు, ప్రశంసలు అందుకున్నానని అయితే ఏనాడు పొంగిపోలేదు, కృంగిపోలేదన్నారు. తన శాయశక్తులా పదవికి వన్నెతెచ్చానని చెప్పుకొచ్చారు. 

తాను అసెంబ్లీని దేవాలయంగా భావిస్తానని చెప్పుకొచ్చారు. దేవాలయంలోకి వెళ్లేటప్పుడు పూజారి ఎలా అయితే వెళ్తారో తాను కూడా అంతే నిష్పక్షపాతంగా వస్తానని తెలిపారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల కాలంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య తనను ఎంతో బాధించిందని చెప్పుకొచ్చారు. చాలా యాక్టివ్ గా ఉంటున్న ఆయనను హత్య చెయ్యడం కలచి వేసిందన్నారు.