Asianet News TeluguAsianet News Telugu

AP Assembly : ఏపీ అసెంబ్లీలో "కేసీఆర్" రచ్చ

కేసీఆర్ తో ఏపీ సీఎం వైయస్ జగన్ చేసుకున్న ఒప్పందాలు ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడు ప్రశ్నకు వైసీపీ నేతలు సైతం గట్టిగా కౌంటర్ ఇచ్చారు.  విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10కి సంబంధించి ఆస్తులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఏపీకి తీవ్రనష్టం చేకూర్చిందంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Ap assembly sessions: Atchannaidu vs minister kurasala kannababu over telangana cm kcr issue
Author
Amaravathi, First Published Dec 9, 2019, 11:44 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే వాడీవేడీగా ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో టీడీపీ ఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కేసీఆర్ తో ఏపీ సీఎం వైయస్ జగన్ చేసుకున్న ఒప్పందాలు ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడు ప్రశ్నకు వైసీపీ నేతలు సైతం గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 

విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10కి సంబంధించి ఆస్తులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఏపీకి తీవ్రనష్టం చేకూర్చిందంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడం వల్లే చంద్రబాబు హైదరాబాద్ వదిలి అమరావతికి వచ్చేశారంటూ విమర్శలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో 89 సంస్థలు ఉమ్మడిగా ఉన్నాయని వాటిని ఎలా పరిష్కరించుకున్నారో చెప్పాలని నిలదీశారు. అయితే ఇప్పటి వరకు 69 అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో అవగాహన ఒప్పందం కుదిరిందని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారని ఏయే అంశాలపై ఒప్పందాలు కుదిరాయి, ఎన్ని సమస్యలకు పరిష్కారం  జరిగిందో చెప్పాలని నిలదీశారు. 

అసెంబ్లీలో హోదా రగడ: చిటికెలు వేసిన అచ్చెన్న, నాలుక మడతపెట్టొద్దన్న మంత్రి కన్నబాబు

ఇకపోతే తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన విలువైన భవనాలను విడిచిపెట్టి వచ్చేశారని చెప్పుకొచ్చారు. తాము అడిగితే భవనాలు పాడుబడిపోతున్నాయని, కరెంట్ బిల్లులు కట్టడం లేదని చెప్పి వారికే వదిలేశారంటూ మండిపడ్డారు. 

షీలాబీడే కమిటీ చెప్పినట్లు షెడ్యూల్ 9లో లక్ష 97వేల కోట్ల ఆస్తులుఉన్నాయని అలాగే 10వ షెడ్యూల్ లో లక్ష 37వేల కోట్లు ఉమ్మడి ఆస్తులు ఉన్నాయని వాటిని పంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తెలంగాణకు సంబంధించిన ముగ్గురు మంత్రులు, ఏపీకి చెందిన ముగ్గురు మంత్రులతో కలిసి గవర్నర్ కమిటీ వేశారని చెప్పుకొచ్చారు. ఆ కమిటీ ఐదుసార్లు భేటీ అయినా ఓ కొలిక్కిరాలేదని చెప్పుకొచ్చారు. 

తెలంగాణలోని హైర్ ఎడ్యుకేషన్ లో ఉన్న ఆస్తులను ఏపీకి బదలాయించాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు స్పష్టం చేసినా నాటి కేసీఆర్ ప్రభుత్వం మాట వినలేదని చెప్పుకొచ్చారు. ముందు భవనాలు ఇస్తేనే వాటిపై మాట్లాడతామని మంత్రివర్గంలో తాము స్పష్టం చేసినట్లు చెప్పుకొచ్చారు. 

ఏపీ అసెంబ్లీ‌లో చంద్రబాబు వ్యాఖ్యలపై గందరగోళం

తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న ఏపీకి చెందిన 300 మంది విద్యుత్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తామని వెళ్తే అక్కడ గేట్లు వేసేశారని వారంతా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపినా కనీసం జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిలదీశారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు.

మాజీమంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరువల్లే ఏపీ అన్ని రంగాల్లో నష్టపోయిందని విమర్శించారు. 

ప్రత్యేక హోదా అంశంపై కేంద్రప్రభుత్వం ఆలోచించే అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు. కానీ చేజేతులా ఉన్న అవకాశాన్ని పాడుచేసి, వీళ్లు ఏమీ చేయలేరన్న భావనను కేంద్ర ప్రభుత్వానికి క్రియేట్ చేసింది చంద్రబాబు అండ్ కో అంటూ విరుచుకుపడ్డారు. 

ప్రత్యేక ప్యాకేజీ చాలంటూ దండలు వేసుకుని, ఊరేగింపు చేసుకున్నది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. షీలా బీడే కమిటీ 89 రికమెండేషన్లు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చాక 68 రికమెండేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని చెప్పుకొచ్చారు. తాము అవన్నీ చేయడానికి  సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ ప్రభుత్వం ఏ అభ్యంతరాలు పెట్టకుండా 68 సిఫార్సులకు సానుకూలత తెలిపిందని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. హోదా విషయంలో టీడీపీ రాజకీయం చేసిందే తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఏనాడు వ్యవహరించలేదని మండిపడ్డారు. 

ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన తర్వాత పారిపోయి ఈ రాష్ట్రానికి వచ్చేశారంటూ విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ 10 సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధాని అయితే కట్టుబట్టలతో పారిపోయి వచ్చారంటూ విరుచుకుపడ్డారు. 

హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బాధపడే పరిస్థితికి తీసుకువచ్చిన చంద్రబాబు చేసిందంతా చేసి ఇప్పుడు నీతికథలు, పిట్టకథలు చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు.  టీడీపీకి ప్రత్యేక హోదాపైన, విభజన హామీలపైన మాట్లాడే హక్కులేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీకి వల్లభనేని వంశీ... టీడీపీ నేతల పక్కనే కూర్చొని...


ఐదేళ్లపాటు ఏమీ చేయకపోగా, ఆరునెలల్లో ఏదో జరిగిపోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినప్పుడు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. 

అలా చేయకుండా మోదీ అన్యాయం చేశారని ఎన్నికల ముందు మాట్లాడి, ఇప్పుడు మళ్లీ మోదీతో జతకట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. నలుగురు ఎంపీలను బీజేపీలకు వలస పంపించి మళ్లీ ఇక్కడ మరోలా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఆస్తుల పంపిణీగురించి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 
ఇచ్చిన భవనాల్లో ఏదీ కూడా విభజన చట్టంలోని పరిధిలోనిది కాదన్నారు. 

విభజన చట్టంలో భవనాల్లోని ఒక్క గదిని కూడా కేసీఆర్ ప్రభుత్వానికి అప్పగించలేదని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా విభజన చట్టంలోని భవనాలను ఆక్రమిస్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. 

అక్కడ సచివాలయంలో భవనాలు ఎందుకు వృథాగా పడి ఉన్నాయి? ముఖ్యమంత్రి కార్యాలయంకోసం అభివృద్దిచేసిన దాన్నికూడా ఎందుకు విడిచిపెట్టారంటూ నిలదీశారు.  ఇప్పుడు అక్కడ ఉండకపోయినా, బూజు పట్టినా కరెంటు బిల్లుల రూపేణా కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఐదేళ్లపాటు వాళ్లుచేసిన నిర్వాకానికి మరో ఐదేళ్లపాటు కష్టపడితే తప్ప తీరనివిధంగా సమస్యలు సృష్టించారంటూ మండిపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వం ఆక్రమించినా అడగలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు ఏవేవో చెప్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో అప్పటి ముఖ్యమంత్రికి ఉన్న బలహీనత వల్లే అడగలేకపోయారంటూ మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు.   

 

Follow Us:
Download App:
  • android
  • ios