కాపులను బిసిల్లోకి చేరుస్తూ ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ శనివారం ఏకగ్రీవంగా ఆమోదించింది. కాపులపు బిసిల్లోకి చేర్చాలన్నది రాజకీయ డిమాండ్. పోయిన ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఈ హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని పక్కన పడేసారు. దాంతో కాపులు ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. దాంతో ఇదే అంశంపై జస్టిస్ మంజూనాధ కమీషన్ వేసారు చంద్రబాబు. కమీషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. అదే నివేదికను శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం జరిగిన మంత్రివర్గం సమావేశం కూడా ఆమోదించగా శనివారం మధ్యాహ్నం అసెంబ్లీ కూడా ఓకే చేసింది.

ఇదే అంశంపై చంద్రబాబు సభలో మాట్లాడుతూ, కాపులను బిసిల్లోకి చేర్చాలన్న అవసరాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో కాపు, బలిజ, ఒంటరి ఉపకులాల జనాభా శాతం తదితరాలను వివరించారు. సుదీర్ఘ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకునే తమ ప్రభుత్వం కాపులను బిసిల్లోకి చేర్చినట్లు తెలిపారు. కాబట్టి కేంద్రం కూడా ఇక్కడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాపులను బిసిల్లోకి చేరుస్తూ అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీలో ఈ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.