హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉదయం నివాళులు అర్పించారు. ఆ తర్వాత రైతులను ఆదుకోవాలని కోరుతూ వరి కంకులను పట్టుకుని కాలినడక శాసనసభకు చేరుకున్నారు. 

అంతకు ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 20 అంశాలపై శాసనసభలో సమగ్ర చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఉపాధి హామీ బకాయిలు, టీడ్కో ఇళ్ల పంపిణీ, ఇసుక పాలసి, ఇళ్ల పట్టాల్లో అవినీతి, పోలవరం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నాకు దిగారు.

వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ టీడీపీ శాసనసభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామనాయుడు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. తుఫాను సందర్భంగా రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం వైఫలమైందని టీడీపీ విమర్శించింది.

ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే సంతాప తీర్మానాలను ప్రతిపాదించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాప తీర్మానం ప్రతిపాదించారు. అలాగే సినీ నేపథ్య గాయకుడు ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం మృతికి మాత్రమే కాకుండా పలువురు ప్రముఖుల మృతికి సంతాప తీర్మానాలు ప్రతిపాదించారు.