కరోనా వైరస్ కారణంగా దాదాపు మూడు నెలల నుంచి దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సడలింపులు ఇస్తుండటంతో వ్యవస్ధలు కాస్త గాడిలో పడుతున్నాయి. తాజాగా శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Also Read:జూన్ 10న సుప్రీంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విచారణ

ఈ మేరకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జగన్ ప్రభుత్వం, ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సభ ప్రారంభంకానుంది. 18న రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్‌‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ సభకు హాజరై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Also Read:పాత రుచి, కొత్త రంగు.. వైసీపీ మాయాజాలానికి ఇవే నిదర్శనాలు : చంద్రబాబు

గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే బీఏసీ సమావేశమవుతుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయనున్నారు. 19వ తేదీన రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరోనా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా అసెంబ్లీ సమావేశాల్ని ముగించేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది.