అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో తాము ప్రవేశపెట్టిన పథకాలకే పేర్లు మార్చి తిరిగి అమలుచేస్తున్నారని... అలాంటిదే రైతు భరోసా అని అన్నారు. అన్నదాత సుఖీభవకు పేరు మార్చి రైతు భరోసా అంటూ హంగామా చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. 

''పాలనలో తనదైన ముద్ర వేయడం అంటే... వైసీపీ పాలకుల అర్ధాలే వేరు. తెలుగుదేశం పథకాలకు వైసీపీ పేర్లు పెట్టుకోవడం, టిడిపి కట్టిన భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడం, స్కీములు రద్దు చేయడం..మసిబూసి మారేడుకాయ చేయడం.. ఏడాది వైసీపీ పాలన నిర్వాకాలు ఇవే'' అంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికన వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

''అధికారంలోకి రాగానే 36 పైగా తెలుగుదేశం పథకాలను రద్దు చేశారు. కొన్నింటికి పేర్లు మార్చి తమ స్టిక్కర్లు వేసుకున్నారు. పాత రుచి, కొత్త రంగు..అదే వైసీపీ మాయాజాలం. "అన్నదాత సుఖీభవ" పథకాన్ని, "రైతు భరోసా"గా చేయడమే వైసీపీ మోసాలకు సాక్ష్యం'' అని తెలిపారు. 

read more  లారీ ఓనర్ల ధర్నా, ఉద్రిక్తత: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఛీటింగ్ కేసు

"అన్నదాత సుఖీభవ పథకం, 4,5 విడతల రుణమాఫీ ద్వారా ప్రతి రైతుకు రూ.  లక్షా 10వేలు వచ్చేవి. "రైతు భరోసా" ముసుగులో ఒక్కో రైతుకు రూ.75వేలు మోసం చేశారు. ఏడాదికి రూ.12,500లు ఇస్తామని నమ్మించి, అందులో రూ 5వేలు ఎగ్గొట్టారు'' అని ఆరోపించారు. 

''ఒక చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం..మాటల్లో తేనె, చేతల్లో కత్తులు- కోతలు.. మోసగాళ్ల(420) పాలన కదా మరి! ఎప్పుడో చనిపోయిన వైఎస్ వల్లే ఇప్పుడు కియా వచ్చిందంటారు. 8ఏళ్ల క్రితం "సున్నా వడ్డీ" పథకం మేమే తెచ్చాం అంటారు'' ఎద్దేవా చేశారు. 

''రూ 1,000 కరోనా సాయం కేంద్రం చేస్తే మేమే ఇచ్చాం అంటారు. గాంధీ విగ్రహానికి, జాతీయ జెండాకు వైసీపీ రంగులేయడం వీళ్ల స్టిక్కర్ల పిచ్చికి పరాకాష్ట. పరుల కష్టానికి వైసీపీ కబ్జా స్టిక్కర్ అంటే ఇదే..'' అంటూ వరుస ట్వీట్లతో వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు చంద్రబాబు.