ముగిసిన బీఏసీ మీటింగ్: ఈ నెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు


ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల 21వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించనున్నారు.

AP Assembly BAC Meeting Decides To Conduct Five days Assembly sessions

అమరావతి:  ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యేల మృతికి సభ సంతాపం తెలిపిన తర్వాత వాయిదా పడింది. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై చర్చించారు. బీఏసీ సమావేశం ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, టీడీపీ శాసనసభపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు  కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ, రేపు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు. శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు, సోమవారం నుండి బుధవారం వరకు అసెంబ్లీని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

also read:టీడీపీ సభ్యుల ఆందోళన: ఏపీ అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా వేసిన స్పీకర్

టీడీపీ సభ్యులు 19 అంశాలను సభలో చర్చించాలని కోరారు. ఈ విషయమై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం 27 అంశాలపై చర్చించాలని భావిస్తుంది.  వ్యవసాయరంగం సంక్షోభం, రాష్ట్ర ఆర్ధిక రంగ పరిస్థితి,వర్షాలు, వరదలపై నష్టాలు , నిరుద్యోగ సమస్య, పోలవరం ప్రాజెక్టు, విభజన అంశాలపై చర్చించాలని టీడీపీ కోరింది.ఈ అంశాలపైచర్చకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.  జిల్లాల విభజన అంశం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మరో వైపు మూడు రాజధానుల అంశంపై కూడా ప్రభుత్వం చర్చ తీసుకు వచ్చే అవకాశం ఉంది. 

బీఏసీ సమావేశం తర్వాత  తన చాంబర్ లో మంత్రులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు.  సభలో అనుసరించాల్సిన అంశంపై  చర్చించారు. సభలో టీడీపీకి ఎలా కౌంటర్ ఇవ్వాలనే విషయమై కూడా మంత్రులకు సీఎం దిశా నిర్ధేశం చేశారు. 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios