Weather Updates: ఏపీ, తెలంగాణకు మరోసారి వర్షాలు… వాతావరణ కేంద్రం హెచ్చరికలు
Weather Updates: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు పొటెత్తడంతో ఏపీలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఇప్పటికీ పలు చోట్ల వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే, రానున్న మూడు రోజులు మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచానా వేసింది.
Weather Updates: ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. మరీ ముఖ్యంగా ఇటీవల రాయలసీమలో భారీ వర్షాలు, వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఇండ్లు నీటిలో కొట్టుకుపోయాయి. చాలా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితులు వుండగా, మరోసారి ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చిరికలు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మెస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. ప్రస్తుతం శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి సముద్రమట్టానికి 0.9 కి.మీ.ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించారు. ఇది తూర్పు దిశ నుంచి ఏపీ, తెలంగాణ వైపు వీస్తున్న గాలులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. దీనికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని చాలా ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయి.
Also Read: Coronavirus: దేశంలో కొత్తగా ఎన్ని కరోనా మరణాలు నమోదయ్యాయంటే?
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఈ ద్రోణి శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉందని తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో ఆంధప్రదేశ్ లోని అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రకాశం జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలావుండగా, ఉత్తర కోస్తాంధ్రలోనూ పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనావేసింది. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశము కూడా ఉందని పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాలు మేఘావృతమై ఉంది. మూడు రోజుల పాటు ఇదే తరహా వాతారణ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read: Summit for Democracy: భారత ప్రజాస్వామ్యానికి అవే మూల స్తంభాలు.. ప్రధాని మోడీ
ఇదిలావుండగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలు ప్రజా జీవితాన్ని స్తంభింపజేశాయి. ముఖ్యంగా రాయలసీమలో గతంలో ఎప్పుడూ పడని విధంగా భారీ వర్షాలు కురవడంతో వరదలు పొటెత్తాయి. వేలాది ఇండ్లు ఈ వరదల్లో కొట్టుకుపోయాయి. డజన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో పశువులు మృత్యువాతా పడ్డాయి. పంట నష్టం కూడా భారీగానే జరిగింది. ఇప్పటికీ చాలా మంది సహాయక శిబిరాల్లో ఉన్నారు. ఆ వరదలు సృష్టించిన బీభత్స పరిస్థితులు ఇంకా సద్దుమనగలేదు. ఇలాంటి పరిస్థితులు ఉండగా, మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: CPJ report: పెరుగుతున్న జర్నలిస్టుల జైలు నిర్బంధాలు