అమరావతి: టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు శుక్రవారం నాడు కొట్టేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించాలని అచ్చెన్నాయుడు భావిస్తున్నారు. ఇప్పటికే తనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరుతూ అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

also read:హైకోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు: రేపు విచారణ

ఈఎస్ఐ స్కాంలో జైలులో ఉన్న అచ్చెన్నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ వాదించింది. దీంతో ఏసీబీ కోర్టు అచ్చెన్నాయుడుకు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో బెయిల్ కోసం అచ్చెన్నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. 

ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన అచ్చెన్నాయుడును ఈ నెల 1వ తేదీన జీజీహెచ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుండి నేరుగా ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. 

దీంతో తనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరుతూ అచ్చెన్నాయుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది.ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చును అచ్చెన్నాయుడు భరిస్తారని కూడ ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయమై కోర్టు రేపు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడును గత నెల 12వ తేదీన ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిమ్మాడలో ఉన్న అచ్చెన్నాయుడు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించిన విషయం తెలిసిందే.