గుంటూరు: టీడీఎల్పీ ఉపనాయకుడు అచ్చెన్నాయుడు గురువారం నాడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన గురువారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు.

గుంటూరు ఆసుపత్రిలో ఉన్న అచ్చెన్నాయుడును ఈ నెల 1వ తేదీ సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. అదే రోజు సాయంత్రం గుంటూరు జైలుకు తరలించారు. అనారోగ్యంగా ఉన్న అచ్చెన్నాయుడును జైలుకు తరలించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బెయిల్ వస్తోందనే ఉద్దేశ్యంతో అచ్చెన్నాయుడును జైలుకు తరలించారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.

also read:మళ్లీ కస్టడీకి ఇవ్వండి: అచ్చెన్నాయుడిపై కోర్టులో పిటిషన్ వేయనున్న ఏసీబీ..?

తనను ఆసుపత్రికి తరలించాలని కోరుతూ అచ్చెన్నాయుడు గురువారం నాడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పై ఈ నెల 3వ తేదీన విచారణ జరగనుంది. 

మరో వైపు ఈఎస్ఐ స్కాంలో మరోసారి అచ్చెన్నాయుడిని తమ కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది. ఇదే కేసులో మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొన్న అచ్చెన్నాయుడు తమ విచారణకు సహకరించలేదని ఏసీబీ అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. దీంతో మరోసారి కస్టడీకి తీసుకొనే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.