అన్నంపెట్టే రైతన్న అనే కనికరం కూడా చూపలేదు. కన్నతల్లి లా కాపాడుకున్న భూమినే చెర పట్టారు... పైసా పరిహారం ఇవ్వలేదు... న్యాయం చేయమని వేడుకుంటే అన్యాయంగా హింసించారు.   

బొగ్గును మింగిన ఘనుడు దర్జాగా తిరుగుతాడు. బ్యాంకును ముంచిన మోసగాడు ఫారిన్ ట్రిప్ లో ఉంటాడు. పట్టడన్నం పెట్టే రైతన్న మాత్రం తప్పు చేయకపోయినా తిప్పలు పడుతాడు. పార్టీలు మారుతున్న రైతన్న బతుకు మాత్రం మారడం లేదు.

రాజకీయం, అధికారం కలసి చేస్తున్న కుట్రలో ప్రతిసారి అన్నదాతే బలవుతున్నాడు. ఆదివారం అనంతపురంలో జరిగిన సంఘటన దీనికో ఉదహరణ.


ప్రభుత్వం... ప్రైవేటు భూమిని తీసుకుంటే దానికి సొంతదారు అనుమతి తీసుకోవాలి. అతడు ఒప్పుకుంటేనే నష్టపరిహారం చెల్లించి న్యాయసమ్మతంగా ఆ భూమిని కొనుక్కోవాలి. ప్రభుత్వ చట్టాలు అలానే చెబుతున్నాయి. కానీ, బక్క రైతుకు ఇవేవీ తెలియవు కదా.. అందుకే అధికారులు చట్టాన్ని తుంగలో తొక్కారు. అతడి భూమిని చీప్ గా కొట్టేయాలని ప్రయత్నించారు.

అనంతపురంలోని మడకశిర మండలం మేలవాయిలో ఓ రైతు భూమి నుంచి విద్యుత్ లైన్ వేయడానికి అధికారులు నిర్ణయించారు. పావగడ నుంచి మధుగిరికి ఆ విద్యుత్ లైన్ వెళ్లాలి. అయితే మధ్యలో రైతు పొలం నుంచి విద్యుత్‌ లైన్‌ వేయాల్సి వచ్చింది.

అయితే ఆ రైతుకు సరైన నష్ట పరిహారం ఇవ్వకుండానే అతడి భూమిలో పనులు కొనసాగించడానికి అధికారులు ప్రయత్నించారు. దీంతో ఆ రైతు అతడి కొడుకు ఎదరుతిరిగారు. తమ భూమి నుంచి వెళుతున్న విద్యుత్ లైన్ ను పట్టుకొని నిరసనకు దిగారు.

అయితే ఆ తండ్రికొడుకులను సముదాయించి నష్టపరిహారం గురించి చర్చించాల్సిన అధికారులు ఆ పని చేయలేదు. వారిని కనీసం మనుషులుగా కూడా భావించలేదు.

విద్యుత్‌ తీగలను పట్టుకొని తండ్రీకొడులు నిరసన తెలుపుతుంటే జేసీబీతో ఆ వైర్లను పైకి లాగారు. దీంతో తీగలకు వేలాడుతున్న తండ్రీకొడుకులు పైనుంచి కిందపడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.