విజయనగరం: పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే భర్తను చంపించిన సరస్వతి కేసు మరో మలుపు తిరిగింది. విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్యాయర్ వద్ద గల ఐటిడిఎ పార్కు సమీపంలో నవవరుడు హత్యకు గురైన విషయం తెలిసిందే.

భర్త గౌరీశంకర్ ను తన ప్రియుడు శివకుమార్ సాయంతో చంపించిన సరస్వతి ఆ తర్వాత చోరీ డ్రామా ఆడిన విషయం కూడా విదితమే. గౌరీశంకర్ ను ఆయన భార్య సరస్వతి, ప్రియుడు శివకుమార్ కలిసి విశాఖకు చెందిన ముఠాతో హత్య చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. 

తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సరస్వతికి బెంగళూరులో ఓ స్నేహితురాలు ఉంది. సరస్వతి భర్త గౌరీశంకర్ కూడా బెంగళూరులోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు. వివాహానికి ముందే ఆ స్నేహితురాలితో కలిసి సరస్వతి గౌరీశంకర్ ను బెంగళూరులోనే హత్య చేయించడానికి కుట్ర చేసినట్లు చెబుతున్నారు. 

సరస్వతి స్నేహితురాలు ఎవరనేది బయటపడలేదు. కానీ ఆ స్నేహితురాలిని పోలీసులవు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బెంగళూరులో హత్య చేయడం కుదరకపోవడంతో విశాఖ గ్యాంగుతో సరస్వతి తన భర్తను హత్య చేయించింది.