మడకశిర నగర పంచాయతీలో వైసీపీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం విజయవంతమైంది. టీడీపీ మద్దతుతో కౌన్సిలర్ నరసింహరాజు నూతన చైర్మన్‌గా ఎన్నికయ్యారు 

Andhra Pradesh Politics : ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయాలు టర్న్ అయ్యాయి. అప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా వున్న రాజకీయాలు టిడిపి, జనసేన, బిజెపి కూటమికి అనుకూలంగా మారాయి. ఈ క్రమంలోనే వివిధ మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల పాలనా పగ్గాలను కూటమి కైవసం చేసుకుంది. తాజాగా మరో నగర పంచాయితీని టిడిపి కైవసం చేసుకుంది. 

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీలో వైసీపీ చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. దీంతో మున్సిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మీనరసమ్మ పదవిని కోల్పోయారు... నగర పంచాయతీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 14మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా కౌన్సిలర్ నరసింహరాజుకు మద్ధతుగా నిలిచారు. దీంతో అతడు మడకశిర నూతన మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. 

ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రిసైడింగ్ అధికారిగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరవగా మిగతావారు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ అవిశ్వాస తీర్మానంలో కౌన్సిలర్లతో పాటు నరసింహరాజుకు స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం.ఎస్.రాజు మద్దతు తెలిపారు. మొత్తం 15మంది మద్దతుతో మడకశిర నగర పంచాయతీలో టిటిడి విజయం సాధించింది. 

మడకశిర నగర పంచాయతీ టీడీపీ ఖాతాలో చేరడం పట్ల నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనకు మున్సిపల్ ఛైర్మన్ గా అవకాశం కల్పించిన టిడిపి నాయకత్వానికి, స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుకు, తోటి కౌన్సిలర్లకు నరసింహరాజు ధన్యవాదాలు తెలిపారు.