ఫిరాయింపు ఎంఎల్ఏ వ్యవహారం చివరకు బేతాళ ప్రశ్నలాగ తయారైంది. ఇప్పటికే వారిని అనర్హులుగా చేసే వ్యవహారం స్పీకర్ పరిశీలనతో పాటు హై కోర్టులో ఉన్న విషయం తెలిసిందే.  వారి అనర్హతపై తాజాగా మరో కేసు హైకోర్టులు దాఖలైంది. వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన 22 మంది ఎంఎల్ఏలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలంటూ ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్ఏ అన్నా వెంకట రాంబాబు ప్రజాహిత వ్యాజ్యాన్ని వేశారు.

పార్టీ ఫిరాయించిన వారిలో అమరనాధరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియలు మంత్రి పదవులు తీసుకోవటానికి కూడా అనర్హలంటూ రాంబాబు తన పిటీషన్లో పేర్కొన్నారు. ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలంటూ శాసనసభ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన ఉపయోగం లేకపోవటంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు.

ఫిరాయింపుల అనర్హత కేసులను త్వరగా పరిష్కరించాలని సుప్రింకోర్టు కూడా చెప్పిన విషయాన్ని మాజీ ఎంఎల్ఏ తన పిటీషన్లో గుర్తు చేశారు. రాజ్యంగంలోని 2(1)(ఎ) షెడ్యూల్ ప్రకారం పార్టీ మారిన ఎంఎల్ఏలు తమ పదవులకు వెంటనే రాజీనామాలు చేయాలన్నారు. అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు 193 అధికరణం ప్రకారం  వారందరికీ రోజుకు రూ. 500 జరిమాన విధించాలన్నారు. హై కోర్టులోని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.