ఐఏఎస్ కావాలన్న కల నెలవేరకుండానే తీవ్ర మనస్థాపంతో  అన్నవరం సచివాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు విశాఖపట్నంలోని ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్నాడు. 

విశాఖపట్నం: సివిల్స్ కు ప్రిపేర్ అయిన అతడు ఐఏఎస్, ఐపిఎస్ కావాలని కలలుగన్నాడు. కానీ పరిస్థితుల నేపథ్యంలో చివరకు సచివాలయ ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఆశించిన లక్ష్యానికి దూరంగా నిలవడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన యువకుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... కాకినాడ జిల్లా అన్నవరం సచివాలయంలో అశోక్ కుమార్ డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. సివిల్స్ కు ప్రిపేరవుతున్న అతడు డిల్లీలో ట్రైనింగ్ కు వెళుతున్నానని చెప్పి మే12వ తేదీన కుటుంబసభ్యులకు చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు.

అశోక్ కుమార్ నిజంగానే డిల్లీలో వున్నాడని కుటుంబసభ్యులు బావిస్తున్నారు. కానీ తాజాగా అతడు విశాఖపట్నంలోని ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడు డిల్లీకని చెప్పి వైజాగ్ కు వెళ్లినట్లు... అక్కడ ఏమయ్యిందో తెలీదుగానీ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. 

రుషికొండలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో అశోక్ కుమార్ మృతదేహాన్ని గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతడున్న రూంలో తనిఖీ చేయగా సూసైడ్ నోట్ లభ్యమయ్యింది.

ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు అశోక్ సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. తన చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి పొంతన లేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఐఏఎస్ కావాలనే తన కల నెరవేరకుండానే చనిపోతున్నట్లు వెల్లడించాడు. తన మొబైల్‌ను భార్యకు అప్పగించాలని లేఖలో అశోక్ తెలిపారు.

ఇక ఇలాగే వయసు మీదపడుతున్నా జీవితంలో సెటిల్ కావడంలేదని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఎన్ని పెళ్లిసంబంధాలు చూసినా పెళ్ళిమాత్రం కావడంలేదని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్ లో విజయ లక్ష్మీ (26) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. ఆమెకు గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే చాలామంది వచ్చి చూసి పోతున్నారే కానీ.. సంబంధం కుదరడం లేదు. తనకు పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా వివాహం మాత్రం కావడంలేదని ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో జీవితంపై విరక్తితో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. 

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విజయలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురవగా... గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయలక్ష్మి మృతి చెందింది. 

ఇలా కెరీర్ కోసం ఒకరు, పెళ్ళి కోసం మరొకరు ఆత్మహత్యలు చేసుకోవడం నేటి యువత ప్రతి విషయానికి ఎంత ఒత్తిడికి గురవుతున్నారో తెలియజేస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెందడం... క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడడం ఇటీవలి కాలంలో యువతలో ఎక్కువగా కనిపిస్తుంది.