ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి ప్రభావం టీడీపీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల... సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ వీడగా... తాజాగా మరో సీనియర్ నేత చంద్రబాబుకి షాకిచ్చారు.

టీడీపీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ టీడీపీకి గుడ్‌ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో ఎమ్మెల్సీ పదవికి  ఆయన రాజీనామా చేయనున్నారు. ఆయన టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు.ఈ విషయాన్ని ఆయన సన్నిహితులే స్వయంగా వెల్లడించారు. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.

 గుంటూరు జిల్లా టీడీపీలో ఆయన కీలక నేత ఉన్నారు. బాపట్ల టీడీపీలో అన్నం సతీష్ తిరుగులేని నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయారు. సతీష్ కృషిని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మండలికి పంపారు. అయితే ఆయన ఇప్పుడు టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.