ఏపీలో 45.71 లక్షల రైతు కుటుంబాలకు రూ.20 వేల ఆర్థికసాయం అందించే అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం అమలుకు ముహుర్తం కుదిరింది.ఈనెల 20 న ఈ పథకం మొదటి విడతకి శ్రీకారం చుట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకం అమలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం మూడు విడతలుగా అందించనున్నారు.

ఈ నెల 20న..

మొదటి విడతగా ఈ నెల 20న రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7 వేలు జమ చేయనున్నారు. ఇందులో రూ.2 వేలు పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించగా, మిగిలిన రూ.5 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. కేంద్రం తేదీలో మార్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా మార్చే అవకాశం ఉంది.

రెండో విడత అక్టోబరులో…

రెండో విడతగా అక్టోబరులో మరో రూ.7 వేలు అందిస్తారు. ఇందులో రూ.5 వేలు రాష్ట్రం, రూ.2 వేలు కేంద్రం నుంచి వస్తుంది. మూడో విడతగా వచ్చే జనవరిలో రూ.6 వేలు చెల్లించనున్నారు. ఇందులో రాష్ట్రం రూ.4 వేలు, కేంద్రం రూ.2 వేలు అందజేస్తుంది.

ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 45.71 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించడం జరిగింది. మొత్తం 93 లక్షల మంది రైతులున్నా, ఆదాయపన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయేతర ఉపయోగాల కోసం భూమిని వినియోగించే వారు, ప్రజాప్రతినిధులు వంటి వారిని పథకం నుంచి తప్పించారు.

79 లక్షల మంది అర్హులు..

రైతు సేవా కేంద్రాల ద్వారా 79 లక్షల మంది అర్హుల జాబితా సిద్ధం చేయగా, ఆరు దశల్లో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత 45.71 లక్షల కుటుంబాలకు మెరుగైన మద్దతు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పథకం అమలులో ఒక్కో కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణిస్తున్నారు.

కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించనుండగా, వారిని గుర్తించి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. పంటకాలంలో వారి వివరాలను సేకరించి, వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించనుంది.

ఈ పథకం కింద అటవీ భూములపై పత్రములు పొందిన రైతులు కూడా లబ్ధిదారులుగా పరిగణిస్తారు. ఈకేవైసీ(EKYC) పూర్తయిన రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు రైతులకు స్థిరమైన ఆర్థిక భరోసా కల్పించనున్నాయి.