విభజన హామీలు నెరవేర్చకపోయినా.. కేంద్రం సహకరించకపోయినా అందరి సహకారంతో నిలదొక్కుకున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

విభజన హామీలు నెరవేర్చకపోయినా.. కేంద్రం సహకరించకపోయినా అందరి సహకారంతో నిలదొక్కుకున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తమ వేతనాలు పెంచినందుకు గానూ ఆశావర్కర్లు ఇవాళ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎంను ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు సన్మానించారు.

ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మనమే మొదటిస్థానంలో ఉన్నామని.. శాశ్వతంగా మనమే ఎప్పటికీ తొలిస్థానంలో ఉంటామని సీఎం స్పష్టం చేశారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. అంగన్ వాడీల సేవలు నచ్చే వేతనాలు పెంచామని.. గర్భిణీల్లో రక్తహీనత తగ్గించడంలో కృష్ణాజిల్లా మంచి ఫలితాలు సాధించిందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆడబిడ్డలు ఎక్కడా చేయి చాచకూడదనేదే తమ ప్రభుత్వ ఆలోచన అన్నారు.

శాశ్వత అంగన్‌వాడీ భవనాలు నిర్మిస్తున్నామి.. వీరికి రేషన్ కార్డులు, చంద్రన్న బీమా వర్తింపజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా, అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్ల అంశంపై సభలో చర్చ జరిగింది.. చాలామంది అంగన్‌వాడీ కార్యకర్తలు తమకు సెల్‌ఫోన్లు రాలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. కేవలం రెండు జిల్లాలకు మాత్రమే సెల్‌ఫోన్స్ ఇచ్చారని ఇప్పుడే తెలిసిందని.. ఆగష్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలందరికీ సెల్‌ఫోన్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.