మణిపూర్ నుండి తమను సురక్షితంగా ఏపీకి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అనంతపురానికి చెందిన విద్యార్ధిని యజ్ఞశ్రీ కోరారు.
ఇంపాల్: అనంతపురం జిల్లాకు చెందిన యజ్ఞశ్రీ అనే విద్యార్ధి మణిపూర్ లో చోటు చేసుకున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. మణిపూర్ నుండి తమను అనంతపురానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
అనంతపురానికి చెందిన యజ్ఞశ్రీ ఇంపాల్ లో ఎన్ఐటీలో విద్యనభ్యసిస్తుంది. ఇంపాల్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న హాస్టల్ లో సౌకర్యాలు కూడా సరిగా లేవని విద్యార్ధిని పేరేంట్స్ కు సమాచారం ఇచ్చారు. మంచినీళ్లలో విషం కలిపారని యజ్ఞశ్రీ పేరేంట్స్ కు చెప్పారు. ప్రతి రోజూ రాత్రి పూట బాంబు దాడులు చోటు చేసుకుంటున్నాయని బాధిత విద్యార్ధిని ఓ న్యూస్ చానెల్ కు చెప్పారు. తమ క్యాంపస్ లో సుమారు 70 మందికి పైగా ఏపీ విద్యార్ధులున్నట్టుగా ఆమె చెప్పారు.
మణిపూర్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విమానాలు నడపడం లేదని విమానాయ సంస్థలు ప్రకటించినట్టుగా యజ్ఞశ్రీ మీడియాకు చెప్పారు. తమను
సురక్షితంగా ఏపీకి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని యజ్ఞశ్రీ ప్రభుత్వాన్ని కోరారు ఇదిలా ఉంటే మణిపూర్ లో చోటు చేసుకున్న పరిస్థితులపై తమ కూతురు ఫోన్ చేసి చెబుతుంటే భయమేస్తుందని యజ్ఞశ్రీ పేరేంట్స్ చెబుతున్నారు. మణిపూర్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను వెంటనే రాష్ట్రానికి రప్పించాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్ధులను తక్షణమే మణిపూర్ నుండి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడ మణిపూర్ లో చిక్కుకున్న విద్యార్ధులను రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మణిపూర్ లో సుమారు 100 మంది విద్యార్ధులు ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఏపీ సర్కార్ కూడా విద్యార్ధుల కోసం ప్రత్యేక విమానాలను పంపనుంది. మరో వైపు మణిపూర్ లో చిక్కుకున్న విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మణిపూర్ రాష్ట్రంలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్ధుల కోసం కేసీఆర్ సర్కార్ ప్రత్యేక విమానాలను పంపింది. తెలంగాణకు చెందిన సుమారు 250 మంది విద్యార్ధులతో కూడిన రెండు విమానాలు ఇవాళ మధ్యాహ్నం హైద్రాబాద్ కు చేరుకుంటాయి. ఒక విమానం శంషాబాద్, మరో విమానం బేగంపేటకు ఇవాళ వస్తాయి.
