నంద్యాల: కర్నూల్ జిల్లా నంద్యాలలో ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడికి దిగింది.ఈ ఘటనలో ప్రియుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నంద్యాల మండలం పెద్దకొట్టాలలో తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి తాను గతంలో ప్రేమించిన యువకుడి  నాగేంద్రపై శుక్రవారం నాడు యాసిడ్ పోసింది. 

నాగేంద్ర అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో నాగేంద్ర కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆగష్టు 13వ తేదీన మరో యువతిని పెళ్లి చేసుకొన్నారు.

తనను కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. 20 రోజుల  క్రితం ఆ యువకుడు మరో యువతితో పెళ్లి చేసుకోవడాన్ని ఆ యువతి తట్టుకోలేకపోయింది.

అయితే నాగేంద్ర  ఇవాళ ఉదయం నంద్యాలకు వెళ్తున్న విషయాన్ని తెలుసుకొన్న యువతి పథకం ప్రకారంగా దాడి చేసింది. నంద్యాలకు వెళ్లడానికి నాగేంద్ర యువతి ఇంటి ముందు నుండే వెళ్లాలి. యువతి ఇంటి ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది. దీంతో నాగేంద్ర బైక్  స్లో అయింది. స్పీడ్ బ్రేకర్ సమయంలో నాగేంద్ర బైక్ స్లో కాగానే ఆ యువతి అతడిపై దాడికి దిగినట్టుగా బాధిత కుటుంబసభ్యులు చెప్పారు. 

ఈ విషయమై కక్ష పెంచుకొన్న యువతి శుక్రవారం నాడు ఉదయం యువకుడిపై యాసిడ్ పోసింది. ఈ యాసిడ్ దాడిలో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడిలో గాయపడిన యువకుడిని స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.