విజయవాడ: ఏడేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్టూరులో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్ది సీతాదేవినగర్ కు చెందిన దంపతుల మధ్య విభేదాలతో వారి ముగ్గురు ఆడపిల్లలు మార్టూరులోని నాయనమ్మ వద్ద ఉంటున్నారు. 

ఆ ఇంటికి సమీపంలో ఉంటున్న బాణావతు సంతోష్ నాయక్ అనే యువకుడు నెల రోజుల క్రితం ఆ ముగ్గురిలో రెండో సంతానమైన 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. విషయం తెలిసి నాయనమ్మ సమీపంలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేయించింది. 

ఈ నెల 5వ తేదీన మార్టూరు వచ్చిన బాలిక తల్లి జరిగిన విషయం తెలుసుకుని గురువారం రాత్రి మార్టూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సంతోష్ నాయక్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

ఇదిలావుంటే, హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై వివాహితుడు అత్యాచారం చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన యువతి అమలాపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. 

అదే హాస్టల్లో ఉంటూ నర్సుగా పనిచేస్తున్న తన వదిన కోసం మండపేటకు చెందిన ఈరెళ్ల రాంబాబు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం రాంబాబు వచ్చినప్పుడు విద్యార్థిని వదిన హాస్టల్లో లేదు. ఆమె గదిలో ఉంటున్న మిక్సీ కావాలని అతను పక్కనే ఉంటున్న విద్యార్థినిని అడిగాడు. 

మిక్సీ తీసుకుని వచ్చేందుకు గదిలోకి వెళ్లిన యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు.