ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో మరోసారి గంజాయి కలకం రేగింది. తిరువూరు పట్టణంలో ఓ యువకుడు గంజాయి మత్తులో వింత చేష్టలు చేశాడు. మానసికంగా స్థిమితం కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులు ఆ యువకుడిని హాస్పిటల్‌కు తరలించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో మరోసారి గంజాయి కలకలం రేపుతున్నది. తిరువూరు పట్టణంలో ఓ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో గంజాయి వ్యాపారం చేస్తున్న ముఠా పోలీసులకు పట్టబడ్డ సంగతి తెలిసిందే. నిందితుల నుంచి సుమారు మూడు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తీసుకుంటున్నవారిలో ఎక్కువగా యువతనే ముఖ్యంగా 19 నుంచి 22 ఏళ్ల వయసు యువకులే ఉన్నారని పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయిస్తున్నవారిని అప్పుడు పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఇప్పుడు మళ్లీ గంజాయి కారణంగా తిరువూరు పట్టణం మరోసారి వార్తలకు ఎక్కింది.
తాజాగా, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో గంజాయి మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఆ యువకుడి వయసు దాదాపు 20 ఏళ్లు ఉంటుంది. తరుచూ ఆ యువకుడు గంజాయి తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ గంజాయి మత్తుకు చిత్తయిన ఆ యువకుడు మానసికంగా స్థిమితం కోల్పోయాడు. కళ్యాణ్‌గా గుర్తించిన ఆ యువకుడు గంజాయికి బానిసయ్యాడు. తరుచూ ఆ మత్తు స్వీకరిస్తూ మానసిక రోగిగా మారాడు. ఇంట్లో వింత చేష్టలు చేస్తున్నాడు. సంబంధం లేకుండా మాట్లాడటం.. కోపంగా అరవడం, కేకలు వేయడం చేస్తున్నాడు.
దీంతో ఈ రోజు తిరువూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు ఆ యువకుడిని తల్లిదండ్రులు చేర్చారు. కానీ, యువకుడి పరిస్థితిని అదుపులోకి తేలేకపోయారు. దీంతో ఆయనను విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఆ యువకుడిని బెడ్‌కు తాళ్లతో కట్టేశారు. ఆయనను బెడ్‌కు కట్టేసి చికిత్స అందిస్తున్నారు. బెడ్‌పై కూడా ఆ యువకుడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు.
తిరువూరు పట్టణంలో గంజాయి సేవనం అధికంగా జరుగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. యువకులు ఈ మాదకద్రవ్యం సేవిస్తూ పట్టణంలో అలజడి సృష్టిస్తున్నారని చెబుతున్నారు. నిత్యం గంజాయి సేవిస్తూ బైకులతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని, ప్రజలకు ఆటంకాలు కలిగిస్తున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.
