ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రోజా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. గండికోట టూ బెంగళూర్, బెంగళూరు టూ గండికోట బస్ సర్వీస్‌ను ప్రారంభిస్తూ తొలిసంతకం చేసినట్టు ఆమె తెలిపారు. రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయని.. విశాలమైన తీరరేఖ ఉందని చెప్పారు. చాలా ప్రాంతాలు టూరిజానికి అనువుగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధి చేస్తామన్నారు. దేశ, విదేశీ టూరిస్టులను అనుకూలమైన టూరిజంను రాష్ట్రంలో రూపొందిస్తామని చెప్పారు.
విదేశీ పర్యాటకులను ప్రోత్సహించేలా అభివృద్ది చేస్తాం. పర్యాటక శాఖ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం జగన్ పాలన చూసి ఇతర రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయని చెప్పారు. తనపై సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. సీఎం జగన్ లాంటి నేతతో కలిసి నడవడం తమ అదృష్టమన్నారు.
తనకు క్రీడలు అంటే చాలా ఇష్టమని.. కరోనా కారణంగా క్రీడలకు దూరంగా ఉన్నారని.. అలాంటి వారిని తిరిగి క్రీడల వైపు మళ్లిస్తామన్నారు. క్రీడాకులకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. గ్రామీణ క్రీడాకరులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామని తెలిపారు.క్రీడాకారులకు వసతులు కల్పిస్తామన్నారు. ఆర్టిస్ట్‌గా కళాకారుల సమస్యలు తమకు తెలుసన్నారు. కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని రోజా తెలిపారు.

ఇక, బుధవారం రోజా.. ముఖ్యమంత్రి సీఎం జగన్‌ను కలిశారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యలయంలో జగన్‌ను కుటుంబ సభ్యులతో పాటు మర్యాదపూర్వకంగా కలిసిన రోజా.. కృతజ్ఙతలు తెలియజేశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు.
ఇక, టీడీపీతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన రోజా.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో రోజా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ జగన్‌పై ఎవరు విమర్శించినా.. రోజా తనదైన శైలిలో వారికి కౌంటర్ ఇచ్చేవారు. నగిరి నియోజవర్గం నుంచి వైసీపీ తరఫున 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన రోజా.. విజయం సాధించారు. 2019లో సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రోజాకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆమెకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. అయితే తాజాగా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా రోజాకు కేబినెట్ బెర్త్ దక్కింది. ఆమెకు సీఎం జగన్.. పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ది శాఖ బాధ్యతలు అప్పగించారు.
