ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది… ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అయితే ఈ ఎన్నికలు పార్టీల మధ్య విబేధాలను మరింత పెంచాయి… కొన్నిచోట్ల దాడులు మొదలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, పుంగనూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. రాయచోటిలో వైసీపీ కార్యాలయం, వాహనాలపై దాడి జరిగింది... నిప్పంటించడంతో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. మరోవైపు పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి నామినేషన్ కేంద్రానికి వెళ్లిన సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైన రోజే చోటుచేసుకున్న ఈ పరిణామాలు జిల్లాలో కలకలం రేపాయి.

నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5,485 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

అక్టోబర్ 19న నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అక్టోబర్ 21 వరకు అవకాశం ఉంటుంది. అనంతరం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ఖరారు కానుంది.

రాష్ట్రంలో 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొంది ఎన్నికల సంఘం. అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో అధికారం దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల దశ నుంచే రాజకీయ వాతావరణం వేడెక్కింది.

రాయచోటి, పుంగనూరులో ఉద్రిక్తత

అన్నమయ్య జిల్లా రాయచోటిలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి చెందిన కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ కార్యాలయంతో పాటు అక్కడ ఉన్న వాహనాలకు నిప్పంటించడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో సుమారు 10 వాహనాలు దగ్ధమైనట్లు సమాచారం.

దాడి జరిగిన సమయంలో శ్రీకాంత్ రెడ్డి కార్యాలయంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాజకీయ ఘర్షణల నేపథ్యంలో అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.

ఇదే అన్నమయ్య జిల్లా పుంగనూరులోనూ నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంపీ మిథున్ రెడ్డి నామినేషన్ కేంద్రానికి వెళ్లిన సమయంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టిడిపి శ్రేణులు ఎంపీ కారుతో పాటు కాన్వాయ్ లోని వాహనాలపై రాళ్లు రువ్వారు. మిథున్ రెడ్డిని పోలీసులు ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లగా, ఆ గదిలోకి వెళ్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. మరోవైపు ఆందోళనకారులు బారికేడ్లను తోసుకుని నామినేషన్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

Scroll to load tweet…

పలువురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

పుంగనూరులో జరిగిన ఘర్షణలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఆయన గన్‌మెన్‌కు కూడా గాయాలయ్యాయని, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఓ టీడీపీ కార్యకర్త కూడా గాయపడినట్లు సమాచారం.

ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ ఎంపీ మిథున్ రెడ్డితో మాట్లాడినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా టీడీపీ నేత మధు రాయల్‌పై కూడా మిథున్ రెడ్డి అనుచరులు దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఎన్నికల వేళ శాంతిభద్రతలపై ఆందోళన

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజే రాయచోటి, పుంగనూరులో చోటుచేసుకున్న ఘటనలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ వంటి కీలక దశలు ఇంకా మిగిలి ఉండటంతో ఎన్నికల కేంద్రాల వద్ద భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు చట్టాన్ని గౌరవిస్తూ వ్యవహరించడం, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా సహకరించడం కీలకం.