ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుకొన్నారు: బాబుపై కొడాలి నాని ఫైర్
2014లో చంద్రబాబుకు అధికారం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు అనుకొంటున్నారని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు.
అమరావతి: 2014లో చంద్రబాబుకు అధికారం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు అనుకొంటున్నారని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు.ఆదివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 2014లోనే జగన్ కు అధికారం ఇచ్చి ఉంటే బాగుండేదని ప్రజలు అనుకొంటున్నారన్నారు. రెండేళ్లలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రూ. 1లక్షా 31 వేల కోట్లను పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల కింద అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోను భగవద్దీత, బైబిల్, ఖురాన్ గా భావించి సుమారు 95 శాతం అంశాలను అమలు చేస్తున్నామన్నారు.
చంద్రబాబు మాదిరిగా అధికారంలోకి వచ్చే వరకు మేనిఫెస్టో ను ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను కన్పించకుండా చేయలేదన్నారు.కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీని పరిధిలోకి కరోనా వైద్య చికిత్సను తీసుకొచ్చి పేదలకు ఇబ్బందిలేకుండా తమ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.
వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకొంది చంద్రబాబునాయుడేనని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అప్పట్లో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కుటుంబసభ్యులు లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో భారతరత్నను ప్రకటిస్తే లక్ష్మీపార్వతి భారతరత్నను తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని భావించిన చంద్రబాబునాయుడు అడ్డుకొన్నారని ఆయన విమర్శించారు.