జగన్ ప్రభుత్వానికి  ఏపీ హైకోర్టులో మంగళవారం నాడు ఎదురు దెబ్బ తగిలింది. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు చేస్తూ ఏపీ గవర్నర్ విడుదల చేసిన గెజిట్ పై హైకోర్టు 'స్టేటస్ కో విధించింది.

ఈ కేసు విచారణను ఆగష్టు 14వ తేదీకి వాయిదా వేసింది.  ఆగష్టు 14వ తేదీ వరకు స్టేటస్ కో కొనసాగుతోందని హైకోర్టు తెలిపింది.పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులకు ఈ ఏడాది జూలై 31వ తేదీన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు.

అయితే ఈ విషయమై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం నాడు మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఇవాళ మరో పిటిషన్ కూడ దాఖలైంది. మొత్తం నాలుగు పిటిషన్లు ఈ విషయమై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.

also read:అమరావతిపై టీడీపీ, వైసీపీ,జనసేన రాజీనామా సవాళ్లు: వేడేక్కిన ఏపీ రాజకీయాలు

అమరావతి విషయమై గతంలోనే ఏపీ హైకోర్టులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై  సెలెక్ట్ కమిటిని ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ కూడ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కూడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ విషయాలపై పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నందున స్టే విధించాలని కోరుతూ పిటిషనర్లు హైకోర్టును కోరారు. మధ్యాహ్నం రెండున్నర తర్వాత  ఈ కేసుపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు యదాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది.

ఈ విషయంలో రిప్లై కొంటర్ ఇవ్వాలని కూడ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో మూడు రాజధానుల  అంశాన్ని ప్రభుత్వం తెరమీదికి తెచ్చింది.