స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో ఎట్ హోం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు హాజరయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి  గవర్నర్ ఉండటంతో హైదరాబాద్‌లో ఎట్ హోం కార్యక్రమం జరిగేది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డేల నాడు గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో ఎట్ హోం కార్యక్రమం జరిగేది.

ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని పెంపోందించడంతో పాటు రాజకీయ చర్చలకు సైతం ఎట్ హోం కార్యక్రమం వేదికగా నిలిచేది. అయితే హైకోర్టు సహా పాలనా యంత్రాంగం మొత్తం అమరావతిలో కేంద్రీకృతం కావడంతో ఇరు రాష్ట్రాలకు వేరు వేరు గవర్నర్లను నియమించాలని పలువురు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ క్రమంలో నరేంద్రమోడీ మరోసారి అధికారంలోకి రావడంతో ఏపీ, తెలంగాణలకు విడివిడిగా గవర్నర్‌ను నియమించారు. ఈ క్రమంలోనే బిశ్వభూషణ్ హరిచందన్‌ను విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి గవర్నర్‌గా నియమించారు రాష్ట్రపతి.

ఆయన ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎట్ హోం కార్యక్రమాన్ని అమరావతిలో నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దూరంగా ఉన్నారు.

గత కొద్దిరోజులుగా చేతినొప్పితో బాధపడుతున్న ఆయనకు రెండు రోజులు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించడంతో బాబు హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో ఆయన ఎట్ హోం‌కు హాజరుకావడం లేదని సమాచారం.

రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎట్ హోం: హాజరైన సీఎం కేసీఆర్