నా ప్రభుత్వ పాలన అద్భుతం... ప్రజలకు మేం చేసిందిదే..: అసెంబ్లీలో గవర్నర్ సుదీర్ఘ ప్రసంగం
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసారో అసెంబ్లీ వేదికగా వివరించారు గవర్నర్ అబ్దుల్ నజీర్.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుండి ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పాటువరకు రాష్ట్ర ఆదాయవ్యయాలకు సంబంధించి ఈ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇలా బడ్జెట్ 2024 ను ఆమోదించేందుకు ఏర్పాటుచేసిన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభయ్యారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమానికి గత ఐదేళ్లలో ఏమేం చేసిందో గవర్నర్ ఉభయసభల సాక్షిగా ప్రజలకు వివరించారు.
ఇంతకాలం నిర్లక్ష్యానికి గురయిన వర్గాల ప్రయోజనం కోసమే తమ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందని గవర్నర్ పేర్కొననారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి మనసుపెట్టి పనిచేస్తోందని కొనియాడారు. ఇలా అద్భుతంగా పనిచేస్తున్న ప్రభుత్వ పనితీరుగురించి గొప్పగా చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
భారత రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటుచేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. రూ.404 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విగ్రహం భవిష్యత్ తరాలకు గుర్తిండిపోయేలా చరిత్రలో నిలుస్తుందన్నారు. ఇది సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల సాధికారత పట్ల ప్రభుత్వ నిబద్దతకు నిదర్శమని అన్నారు.
నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఏపీలో పేదరిక నిష్పత్తి 2015-16 లో 11.77 శాతం వుంటే 2022-23 నాటికి 4.19 శాతానికి తగ్గిందని గవర్నర్ తెలిపారు. కానీ దేశంలో ప్రస్తుతం ఇది 11.28 శాతంగా వుందని... 2024-25 లో ఇది సింగిల్ డిజిట్ కు చేరుకునే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారని అన్నారు. ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమ విధానాలకు నిదర్శమని అన్నారు.
Also Read ఒకే రోజు రెండుసార్లు చంద్రబాబు, పవన్ భేటీ ... అయినా ఆ విషయంలో నో క్లారిటీ?
ఇక విద్యారంగంలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అంతర్జాతీ స్థాయి విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. విద్యారంగంలో ప్రవేశపెట్టిన పథకాల కోసమే ప్రభుత్వం ఇప్పటివరకు రూ.70,417 కోట్లు ఖర్చు చేసిందన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేందుకు పేదరిక అడ్డు కాకూడదనే 'జగనన్న అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించామని అన్నారు. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతి పేద విద్యార్థి తల్లి ఖాతాలో నేరుగా డబ్బులు వేస్తున్నామని అన్నారు. దీంతో చదువుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని గవర్నర్ తెలిపారు.
ఇక గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీల అభివృద్ది, మౌళిక సదుపాయాల కల్పనకు మనబడి-నాడునేడు కార్యక్రమాన్ని చేపట్టినట్లు గవర్నర్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటివరకు రూ.7,163 కోట్లు ఖర్చుచేసామని తెలిపారు. పోషకాహారం కోసం 'జగనన్న గోరుముద్ద'.... పుస్తకాలు, యూనిఫాంతో పాటు ఇతర వస్తువులు అందించేందుకు 'జగనన్న విద్యాకానుక'... వసతి కోసం 'జగనన్న వసతి దీవెన'... విదేశీ విద్య కోసం 'జగనన్న విదేశి విద్యా దీవెన... డిజిటల్ లెర్నింగ్ కోసం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు... ఇలా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఎంతో చేస్తోందని గవర్నర్ నజీర్ తెలిపారు.
ఇక ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను తన ప్రభుత్వం అందిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా హాస్పిటల్స్ లో సదుపాయాలను మరింత మెరుగుపరుస్తున్నామని అన్నారు. ఈ ఐదేళ్లలో 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వైద్యశాఖలో ఖాళీల భర్తీకోసం మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డును ఏర్పాటుచేసినట్లు గవర్నర్ వెల్లడించారు.
ఇక రైతులను కష్టాలు, నష్టాల నుండి గట్టెక్కించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గవర్నర్ తెలిపారు. ఇందులో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.13,500 ఇస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా రూ.33,300 కోట్లను ఇప్పటివరకు ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు.
ప్రజల ఇంటివద్దకే పాలనను తీసుకువెళ్లడానికే పరిపాలనా వికేంద్రీకరణ చేపట్టామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు ఏర్పాటుతో పాలనా సంస్కరణలు చేపట్టామన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటివద్దకే చేరుస్తున్నామన్నారు.
అభివృద్ది విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం విధానాలతో భారీ పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. దీంతో రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు. సమతుల్య, సమ్మిళిత వృద్ది కోసం అత్యుత్తమ విధానాలను, వ్యాపార సంస్కరణలను అనుసరించడం ద్వారా పారిశ్రామికీకరణ సాధ్యమవుతోందని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు పెట్టగా మరికొన్ని ఒప్పందాలు చేసుకున్నాయని గవర్నర్ నజీర్ తెలిపారు.