విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో అమ్మవారి చీర మాయం కావడంతో పాటు.. దేవస్థానం తరచూ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుండటంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దుర్గగుడి ఈవో ఎం. పద్మపై బదిలీ వేటు వేసింది.. ఆమెను ఏపీ బ్రాహ్మణ వెల్పేర్ కార్పోరేషన్ ఎండీగా నియమించడంతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

పద్మ స్థానంలో కొత్త ఈవోగా ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మను నియమించింది. అలాగే ఏపీ స్టెప్ ఎండీగా ఏటూరి భానుప్రకాశ్‌ను నియమించింది. దీనితో పాటు ఇక మీదట ఆలయ పాలనా వ్యవహారాల్లో పాలకమండలి సభ్యులు జోక్యం చేసుకోరాదని హెచ్చరించింది.

మరోవైపు దుర్గగుడి పాలకమండలి సభ్యులతో టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న భేటీ అయ్యారు. ఇకపై ఇంద్రకీలాద్రిపై వివాదాలు వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.. పాలకమండలి వ్యవహారశైలితో పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆలయ పాలనాపరమైన అంశాల్లో సభ్యులెవ్వరూ జోక్యం చేసుకోరాదని... కేవలం ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోపణలు రావడం వల్లనే కోడెల సూర్యలతను తొలగించినట్లు వెంకన్న స్పష్టం చేశారు.