అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణం దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేయనుంది.  సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్యాబ్రికేట్ చేసి డబ్బులను డ్రా చేసినట్టుగా అధికారులు గుర్తించారు. సెక్రటేరియట్ లోని రెవిన్యూ అసిస్టెంట్ సెక్రటరీ ఈ నెల 20వ తేదీన తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోల్‌కతా, మంగుళూరు, ఢిల్లీ రాష్ట్రాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను డ్రా చేసేందుకు ప్రయత్నించారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే డబ్బులు డ్రా చేశారు. ఒక్క చెక్ డ్రా చేయలేదు. రెండు రోజుల క్రితం 45 వేలను డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. అయితే సెక్రటేరియట్ ఎస్బీఐ బ్యాంకులో చెక్ ను క్లియర్ చేసే విషయంలో అనుమానించాడు.

వ్యక్తుల పేరు మీద కాకుండా సంస్థ పేరున సీఎంఆర్ఎఫ్ చెక్ రావడంపై ఎస్బీఐ అధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయమై సచివాలయంలోని రెవిన్యూ అసిస్టెంట్ సెక్రటరీ వద్దకు ఎస్బీఐ అధికారులు వెళ్లి చెక్ ను చూపారు. అయితే చెక్ పై ఉన్న సంతకం కూడ తనది కాదని రెవిన్యూ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్బీఐ అధికారులకు తేల్చి చెప్పాడు.

దీంతో ఈ చెక్ ను క్లియర్ చేయకుండా ఎస్బీఐ అధికారులు నిలిపివేశారు. ఈ విషయమై సచివాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇవాళ సచివాలయంలో సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులను విచారించారు. అదే విధంగా సచివాలయంలోని ఎస్బీఐ అధికారులను కూడ పోలీసులు విచారించారు.

మూడు రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్నందున సీఐడీకి ఈ కేసును బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.