ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు నిర్వహణ సాధ్యం కాదు: హైకోర్టులో జగన్ సర్కార్ అడిషనల్ అఫిడవిట్
వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తేల్చి చెప్పింది.
అమరావతి: వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తేల్చి చెప్పింది.
మంగళవారం నాడు ఏపీ హైకోర్టులో ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.
ఈ విషయమై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ఈ కారణంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన స్టాఫ్, పోలీస్ సిబ్బందిని తాము ఇవ్వలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.ప్రభుత్వం దాఖలు చేసిన అడిషనల్ అఫిడవిట్ కు తాము కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీరును వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. గతంలో ప్రభుత్వంతో సంప్రదించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని వైసీపీ అప్పట్లో తీవ్ర విమర్శించింది.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంటే వైసీపీ ససేమిరా అంటోంది. వైసీపీ తీరును రాష్ట్రంలో విపక్షాలు విమర్శిస్తున్నాయి.