Asianet News TeluguAsianet News Telugu

ఎలక్షన్ కమీషన్ తో మళ్లీ ఢీ... హైకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్

గతంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీకి జగన్ ప్రభుత్వానికి మధ్య చెలరేగిన వివాదం మళ్ళీ అదే విషయంపై మొదలయ్యింది. 

andhra pradesh government filed a housemotion pitition against SEC in the high court
Author
Amaravathi, First Published Oct 28, 2020, 7:25 AM IST

అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘంతో రాష్ట్ర ప్రభుత్వ విబేధాలు కొనసాగుతున్నాయి. గతంలో ఇదే స్థానికసంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య వివాదం చెలరేగింది. మళ్లీ అదే విషయంపై ఇప్పుడు మరోసారి వివాదం రేగుతోంది. 

కరోనా వ్యాప్తి కారణంగా వాయిదాపడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు  బుధవారం అఖిలపలక్ష సమావేశం ఏర్పాటుచేసింది ఈసీ. అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందుగా ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోకుండా ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది.  ఎస్ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశ నిర్వహణను నిలిపివేయాలని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. 

READ MORE  జగన్ విముఖత: రేపటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీపై ఆసక్తి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ హాజరుకావడం లేదని... ఈ మేరకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రెస్ నోట్ ను ఆయన విడుదల చేశారు.

సమావేశానికి ముందు సుప్రీంకోర్టు.. ఏ తీర్పు ఇచ్చిందో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చదువుకోవాలని సూచించారు అంబటి. ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను తీసుకోవాలని సుప్రీం స్పష్టం చేసిందన్నారు అంబటి. మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ ఇచ్చే అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ముందు రాజకీయ పార్టీలను పిలవడంలో వేరే ఉద్దేశ్యాలు ఉన్నాయంటూ ఆయన ఆరోపించారు. దీంతో ఈ సమావేశానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు అంబటి. 

రేపు ఉదయం 10.30 గంటల నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివిధ పార్టీల ప్రతినిధులు కలుసుకుంటారు. పార్టీల ప్రతినిధులను ఆయన విడివిడిగా కలుసుకుని అభిప్రాయాలు సేకరిస్తారు. వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా కూడా సమర్పించాలని ఎస్ఈసీ కోరింది. ఒక్కో పార్టీకి ఎస్ఈసీ ఒక్కో సమయం కేటాయించింది.

తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కొన్ని స్థానిక సంస్థల నిర్వహణకు సుముఖంగా ఉన్నాయి. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం విముఖత ప్రదర్శిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తుత పరిస్థితులో నిర్వహించడం సాధ్యం కాదని ఇప్పటికే మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, కొడాలి నాని స్పష్టంగానే చెప్పారు. కోవిడ్ రెండో వేవ్ ప్రమాదం నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని వారన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios