అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీల అభిప్రాయాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రేపు బుధవారం అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విముఖత ప్రదర్శిస్తున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

రేపు ఉదయం 10.30 గంటల నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివిధ పార్టీల ప్రతినిధులు కలుసుకుంటారు. పార్టీల ప్రతినిధులను ఆయన విడివిడిగా కలుసుకుని అభిప్రాయాలు సేకరిస్తారు. వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా కూడా సమర్పించాలని ఎస్ఈసీ కోరింది. ఒక్కో పార్టీకి ఎస్ఈసీ ఒక్కో సమయం కేటాయించింది.

గడ్డ రమేష్ కుమార్ వివిధ పార్టీలకు ఇప్పటికే ఆహ్వానం పంపించారు. తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కొన్ని స్థానిక సంస్థల నిర్వహణకు సుముఖంగా ఉన్నాయి. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం విముఖత ప్రదర్శిస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తుత పరిస్థితులో నిర్వహించడం సాధ్యం కాదని మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, కొడాలి నాని స్పష్టంగానే చెప్పారు. కోవిడ్ రెండో వేవ్ ప్రమాదం నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని వారన్నారు. 

గతంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఈ వాయిదాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి కూడా తొలగించారు. అయితే, కోర్టు ఆదేశాలతో ఆయనను తిరిగి నియమించాల్సి వచ్చింది. 

ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా చూడాలనే ఎత్తుగడలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేపటి సమావేశంపై ఆసక్తి నెలకొంది.

ఎస్ఈసీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతుదా అనేది ఓ ఆసక్తికరమైన విషయం కాగా, గత ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తుందా, కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తుందా అనేది మరో ఆసక్తికరమైన విషయం.