ఏపీ విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు ఫలించాయి. పీఆర్సీపై ప్రభుత్వం దిగిరావడంతో ఉద్యోగులు సమ్మెలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. యాజమాన్యం ప్రతిపాదనలను విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఆమోదించాయి.

ఏపీ విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు ఫలించాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పీఆర్సీపై ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకారం తెలపడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెను విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. 9 శాతం ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం అంగీకరించినట్లుగాతెలుస్తోంది. అలాగే మాస్టర్ స్కేల్ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లుగా సమాచారం.

ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీసును ఉపసంహరించుకుంది. అలాగే ఒప్పందంపై ఉద్యోగ సంఘాలు సంతకాలు చేశాయి. యాజమాన్యం ప్రతిపాదనలను విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఆమోదించాయి. పే స్కేలు ఫిక్స్ చేసేందుకు ఏజీ జెన్కో ఎండీ ఆధ్వర్యంలో డీస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్దమైన విషయం తెలిసిందే. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాకుంటే ఆగస్ట్ 10 అంటే రేపటినుండి విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతామని విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ సమ్మెను నిలువరించేందుకు ఏం చేయాలన్నదానిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన సబ్ కమిటీతో సమావేశమయ్యారు.

ALso Read: 12 డిమాండ్లపై నేటి నుండి వర్క్ టూ రూల్: ఈ నెల 10 నుండి ఏపీ విద్యుత్ ఉద్యోగుల సమ్మె

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం జగన్ భేటీ అయ్యారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విద్యుత్ ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరిపి సమ్మెకు వెళ్లకుండా ఒప్పించాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు.

గత నెల 20వ తేదీన తమ డిమాండ్లపై ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. 12 డిమాండ్లను విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం ముందుంచారు. వేతన ఒప్పందంతోపాటు పలు అంశాలను విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం ముందుంచారు. ఈ నెల 7వ తేదీన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలమయ్యాయి. అయితే మరోసారి చర్చలకు పిలుస్తామని ప్రభుత్వం ప్రకటించింది.