Asianet News TeluguAsianet News Telugu

రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి రాజధాని విషయంలో తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 190 పేజీలతో కూడిన అఫిడవిట్​ను సీఎస్ సమీర్ శర్మ హైకోర్టుకు సమర్పించారు. 

Andhra pradesh CS Sameer Sharma affidavit in high court Over Amravati verdict
Author
Amaravati, First Published Apr 2, 2022, 4:04 PM IST | Last Updated Apr 2, 2022, 4:04 PM IST

అమరావతి రాజధాని విషయంలో తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు గత నెల 3వ తేదీన రాజధాని కేసులో తీర్పునిచ్చింది. నెల రోజుల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈనెల 3 లోగా రైతుల ప్లాట్లలో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. గడువు ముగుస్తున్నందున ఏపీ ప్రభుత్వం తరఫున సీఎస్ సమీర్ శర్మ అఫిడవిట్ దాఖలు చేశారు. 190 పేజీలతో కూడిన అఫిడవిట్​ను హైకోర్టుకు సమర్పించారు. సీఆర్డీఏ చట్టంలో పనుల పూర్తికి మరో నాలుగేళ్లు పొడిగించామని  ప్రభుత్వం నివేదించింది. ప్రభుత్వ నిర్ణయంతో.. 2024 జనవరి వరకు సమయం ఉందని.. హైకోర్టుకు తెలిపింది. 

గత నెల మూడో తేదీన రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పింది. రాజధాని ప్రాంతలో రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాలయాను నెల రోజుల్లో కల్పించాలని ఆదేశించింది. రాజధాని కోసం సమీకరించిన భూములను రాజధాని  నగర నిర్మాణ, రాజధాని ప్రాంత అభివృద్దికి తప్ప.. తాకట్టు పెట్టడానికి, మూడో వ్యక్తికి హక్కు కల్పించొద్దని స్పష్టం చేసింది. 

ఇక, ఇటీవల ఏపీ అసెంబ్లీలో పాలన వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా ప్రసంగించిన సీఎం జగన్.. అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో వుండాలని.. లేకపోతే మొత్తం సిస్టమ్ కుప్పకూలుతుందన్నారు. రాజధానిపై వాళ్లంతకు వాళ్లే ఊహించుకుని పెట్టారని జగన్ చెప్పారు. శాసన వ్యవస్థ ఓ చట్టాన్ని చేయాలా.. వద్దా అని కోర్టులు నిర్ణయించలేవని ఆయన అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టారని జగన్ పేర్కొన్నారు. నెల రోజుల్లో లక్ష కోట్లతో రాజధాని కట్టేయాలని కోర్టులు ఎలా డిక్టేట్ చేస్తాయన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకు వుందని జగన్  చెప్పారు. 

వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పందని సీఎం గుర్తుచేశారు. 3 రాజధానుల బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంలో చెప్పిన మాటలన్నింటికీ తమ సర్కార్ కట్టుబడి వుందని జగన్ స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని సీఎం తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణపై రాష్ట్ర శాసనసభకు ఎలాంటి అధికారం లేదని కోర్టు తీర్పు చెప్పిందని.. రాజధానిపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏమీ లేదని కోర్టు చెప్పినట్లు జగన్ గుర్తుచేశారు. 

రాజధానిపై నిర్ణయం తమదేనని కేంద్రం కూడా ఎక్కడా చెప్పలేదని సీఎం అన్నారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం కూడా అఫిడవిట్  ఫైల్ చేసిందని చెప్పారు. రాజధానిపై రాష్ట్రానిదే నిర్ణయమని పార్లమెంట్‌లో కూడా ఒక ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందని జగన్ గుర్తుచేశారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చిందని సీఎం తెలిపారు. హైకోర్టు ఎక్కడ వుంటే అక్కడే రాజధాని అనే వాదనను కూడా కొట్టిపారేశారని జగన్ అన్నారు. రాజధానితో పాటు పరిపాలన వికేంద్రీకరణకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. 

మాకు హైకోర్టుపై గౌరవం వుందని.. రాష్ట్ర అసెంబ్లీకి వున్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాపై వుందని జగన్ తెలిపారు. ఎవరో ఫేవర్ చేస్తే తాము ఇక్కడికి రాలేదని.. ప్రజలు ఎన్నుకుంటేనే అసెంబ్లీకి వచ్చామన్నారు. ఇవాళ చర్చ జరగకపోతే చట్టాలు చేయాల్సింది కోర్టులా, అసెంబ్లీనా అన్నది క్వశ్చన్ మార్క్ అవుతుందని జగన్ అన్నారు. ఆచరణ సాధ్యంకాని తీర్పులు వుండకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సీఎం అన్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ వున్నా.. హైకోర్టు ఆచరణ సాధ్యం కానీ తీర్పు ఇచ్చిందని జగన్ చెప్పారు. మాస్టర్ ప్లాన్  కాలపరిమితి 20 ఏళ్లు అని అప్పటి ప్రభుత్వం చెప్పిందని ఆయన గుర్తుచేశారు. 

మాస్టర్ ప్లాన్‌ను ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షించాలని కూడా రాశారని సీఎం  తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను 20 ఏళ్లలో అమలు చేయడం సాధ్యం కాదని అందరికీ తెలుసునని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని ఒక్కటే బాధ్యత కాదని.. ప్రజా సంక్షేమం కూడా ముఖ్యమేనన్నారు. న్యాయ సలహా తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా చర్చలు జరుపుతున్నామని.. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందేలా పరిపాలనా వికేంద్రీకరణను కొలిక్కి తీసుకొస్తామని జగన్ స్పష్టం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తామని.. వికేంద్రీకరణపై వెనకడుగు వేయమన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios