తమ కుటుంబాన్ని చీల్చిందే జగనన్న... ఇందుకు అమ్మే సాక్ష్యం : వైఎస్ షర్మిల సంచలనం
గతంలో సోదరుడు వైఎస్ జగన్ ఇబ్బందుల్లో వుంటే తాను అండగా నిలిచానని ... కానీ ఆయనమాత్రం తనకు అన్యాయమే చేసాడని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు.
రాజమండ్రి : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏకంగా తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసారు. రాజకీయం స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీలుస్తోందన్న సోదరుడి కామెంట్స్ పై షర్మిల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జగనన్నే చేజేతులా కుటుంబాన్ని చీల్చారని... ఇందుకు తమ తల్లి వైఎస్ విజయమ్మే సాక్ష్యమంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు.
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్నే కాదు తన కుటుంబాన్ని చీల్చిందంటూ... దేవుడే గుణపాఠం చెబుతాడని జగనన్న పెద్దపెద్ద మాటలు ఆడుతున్నారని షర్మిల గుర్తుచేసారు. కానీ వైఎస్సార్ కుటుంబం చీలిపోవడానికి జగనన్నే కారణమని ఆమె పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా పర్వాలేదనుకున్నా... తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు నిలబెడితే చాలని అనుకున్నట్లు షర్మిల తెలిపారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక జగనన్న పూర్తిగా మారిపోయారని... ఆంధ్ర రాష్ట్ర అభివృద్దిని పూర్తిగా మరిచారని అన్నారు. అందువల్లే తాను ఆంధ్ర రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు షర్మిల.
గతంలో సోదరుడు వైఎస్ జగన్ ఇబ్బందుల్లో వుంటే తాను అండగా నిలిచానని షర్మిల అన్నారు.ఆయన పార్టీ కోసం తనను పాదయాత్ర చేయమన్నారు... కాదనకుండా అలాగే చేసానని తెలిపారు. తన ఇంటిని, పిల్లలను పక్కనపెట్టి, ఎండావానను లెక్కచేయకుండా కేవలం అన్నకోసమే పాదయాత్ర చేసానన్నారు. ఆ తర్వాత ప్రజల కోసం సమైక్య యాత్ర, తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసానని అన్నారు. ఇలా ఎప్పుడు అడిగితే అప్పుడు మారు మాట్లాడకుండా అన్నకు అండగా నిలబడ్డానని తెలిపారు. జగనన్న మాటకు ఎదురు చెప్పకుండా, స్వలాభం చూసుకోకుండా, నిస్వార్థంగా ఏం చేయమంటే అది చేసానని అన్నారు. గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం కూడా చేసానని అన్నారు. ఇలా ఎంతో కష్టపడితే జగన్ గెలిచారు... కానీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పూర్తిగా మారిపోయారంటూ తన ఆవేదనను వ్యక్తం చేసారు వైఎస్ షర్మిల.
Also Read బీజేపీ తో టీడీపీ, వైసీపీ కుమ్మక్కు - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
జగనన్న వైసిపి పార్టీ పెడితే చాలామంది రాజీనామాలు చేసి ఆయన వెంట నడిచారని షర్మిల అన్నారు. అధికారంలోకి రాగానే వారిని మంత్రులు చేస్తానని జగనన్న హామీ ఇచ్చాడని... కానీ అది నిలబెట్టుకోలేకపోయాడని అన్నారు. హామీ ఇచ్చిన వాళ్లలో ఎంతమందిని మంత్రులను చేసారు? అని జగన్ ను ప్రశ్నించారు వైఎస్ షర్మిల.
ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులతో పాటు వైసిపి నాయకులంతా బిజెపికి బానిసలుగా మారారని షర్మిల ఆరోపించారు. ఏపీలో బిజెపికి ఒక్క ఎంపీగానీ, ఎమ్మెల్యేగానీ లేడు... కానీ ఆ పార్టీ రాజ్యమేలుతోందని అన్నారు. ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడిగారా? అని షర్మిల నిలదీసారు. సీఎం జగన్ వైసిపి పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడని షర్మిల అన్నారు.