వైఎస్ షర్మిల మార్క్ పాలిటిక్స్ ... మాజీ మంత్రి కొణతాలతో భేటీ
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో భేటీ అయ్యారు. ఇప్పటికే జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన కొణతాలతో షర్మిల భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
విశాఖపట్నం : ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసిపి, టిడిపి-జనసేన కూటమి మధ్యే రాజకీయాలు సాగుతుంటే సడన్ గా వైఎస్ షర్మిల ఎంట్రీతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకు ఆయన సోదరి షర్మిలను రంగంలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల జోరు పెంచారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసెందుకు జిల్లాల పర్యటన చేపట్టిన షర్మిల తాజాగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో భేటీ అయ్యారు.
ఇప్పటికే జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన కొణతాలతో షర్మిల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో వున్న షర్మిల స్వయంగా కొణతాల ఇంటికి వెళ్లి కలిసారు షర్మిల. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో కొణతాల మంత్రిగా పనిచేసారు. ఆ పరిచయంతోనే కొణతాల రామకృష్ణతో షర్మిల మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారా? లేక మరేదైనా రాజకీయ ఎత్తుగడ వుందా? అనేది తెలాల్సి వుంది. కానీ వీరి భేటీ రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది.
వీడియో
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా కొనసాగారు కొణతాల రామకృష్ణ. వైఎస్సార్ మృతి తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ వెంట నడిచారు... వైసిపిలో చేరారు. అయితే 2014 ఎన్నికల తర్వాత వైసిపికి కూడా దూరమైన కొణతాల ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా వున్నారు. ఇంతకాలం తర్వాత ఆయన రాజకీయంగా యాక్టివ్ కావడం... జనసేనలో చేరనున్నట్లు ప్రకటించడంతో రాజకీయ చర్చకు దారితీసింది.
Also Read వైసీపీ బ్రాండ్ వద్దు .. నన్ను ఎమ్మెల్యేగా తొలగించలేరు : ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యలు
ఉమ్మడి రాష్ట్రంలో కొణతాల కీలక నాయకుడు... ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చక్రం తిప్పారు. కాంగ్రెస్ నేతగా, మంత్రిగా ఆయన రాజకీయాలను శాసించారు. గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల.. నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో వున్నారు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఓటమి పాలైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడంతో కొణతాల హవా నడిచింది. అనంతరం రాష్ట్ర విభజనతో కొణతాల రామకృష్ణ కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు.
తొలినాళ్లలో రామకృష్ణకు జగన్ ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే 2014లో వైసీపీ ఓటమి పాలవ్వడం, విశాఖ ఎంపీగా విజయమ్మ ఓడిపోవడంతో కొణతాలతో పార్టీ హైకమాండ్‌కు గ్యాప్ వచ్చిందనేది టాక్. ఆ తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. అయితే గత ఎన్నికలకు ముందు రామకృష్ణ టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. చంద్రబాబుతో భేటీ కావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. రాజకీయాలకు దూరంగా వున్నప్పటికీ రైతు సమస్యలు, చెరకు సాగులో ఇబ్బందులు, షుగర్ ఫ్యాక్టరీలు మూతపడటం వంటి వాటిపై కొణతాల రామకృష్ణ పోరాడుతూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ రాజీకయంగా యాక్టివ్ అయ్యారు.