న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మంగళవారం నాడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై ఆయన చర్చించనున్నారు.

ఎనిమిది మాసాల తర్వాత ప్రధాని మోడీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ కావడానికి ఏపీ సీఎం  సోమవారం నాడు మధ్యాహ్నం అమరావతి నుండి న్యూఢిల్లీకి చేరుకొన్నారు.

ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిదుల విషయమై ఆయన చర్చించనున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై  మోడీకి ఆయన వినతి పత్రం సమర్పించనున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు తో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం లేకపోలేదు.

రాష్ట్రంలోని మూడు అంశాలపై సీబీఐ విచారణను  ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ విషయాలపై సీబీఐ విచారణ గురించి సీఎం జగన్ కోరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని వైసీపీ తేల్చి చెప్పింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై మాత్రమే సీఎం జగన్ మోడీతో చర్చిస్తారని పార్టీ వర్గాలు ప్రకటించారు.

ఇటీవల రాజ్యసభలో కొత్త వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతును ప్రకటించింది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మోడీతో జగన్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.