ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం 2023: తాడేపల్లిలో జాతీయ జెండా ఆవిష్కరించిన జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను సీఎం జగన్ బుధవారంనాడు ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం జగన్ స్వీకరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు,తెలుగు తల్లి చిత్రపటాలకు సీఎం జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.స్వాతంత్ర్య ఉద్యమంలో ఆంధ్రులు అనే పుస్తకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన కోసం నాడు సాగిన పోరాటం గురించి ఆయన ప్రస్తావించారు.
2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అప్పట్లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం జూన్ 2న నవనిర్మాణ దీక్షలను ప్రారంబించింది. అయితే ఏపీలో 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 1న రాస్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించేవారు. అదే సంప్రదాయాన్ని జగన్ సర్కార్ చేపట్టింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు వరకు ఎందరో పోరాటాలు నిర్వహించారు. అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది.
also read:ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం: పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది?
ఆ తర్వాత హైద్రాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ సమయంలో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఆంధ్రపాలకులు విస్మరించారని తెలంగాణకు చెందిన వారు అసంతృప్తి చెందారు.ఈ కారణంగానే తెలంగాణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. చివరకు 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది.2014 నుండి ప్రతి ఏటా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ నిర్వహిస్తుంది.