Chandrababu Bail : ఢిల్లీకి ఏపీ సీఐడీ లీగల్ టీమ్... చంద్రబాబు బెయిల్ పై సుప్రీంకోర్టులో సవాల్
తీవ్ర అవినీతి ఆరోపణలున్న చంద్రబాబు బయట వుంటే కేసును ప్రభావితం చేస్తాడని... కాబట్టి అతడికి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ సిఐడి సుప్రీం కోర్టును కోరనుంది.
న్యూడిల్లీ : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సాధారణ బెయిల్ మంజూరుచేసింది ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్ట్ లో సవాల్ చేసేందుకు ఏపీ సిఐడి సిద్దమయ్యింది. ఇందుకోసం ఇప్పటికే ఏపి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు సిఐడి లీగల్ టీం న్యూడిల్లీకి చేరుకుంది. మరికొద్దిసేపట్లో వీరు సుప్రీంకోర్టుకు చేరుకుని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టింది. ఆయనకు బెయిల్ రాకుండా చేసి దాదాపు 50 రోజులకు పైగా జైల్లోనే వుండేలా చేసారు. చివరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన మద్యంతర బెయిల్ మంజూరుచేసింది. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా... కేసును ప్రభావితం చేయకుండా కేవలం వైద్యం చేయించుకోవాలన్న షరతులతో నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరుచేసింది.
ఇలా జైలునుండి బయటకు వచ్చిన చంద్రబాబు కేవలం ఇంటికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఇంట్లో వుంటూ ఇక్కడి హాస్పిటల్స్ లోనే వైద్యం చేయించుకుంటున్నారు. మధ్యంతర బెయిల్ గడువు దగ్గరపడుతున్న సమయంలో రెగ్యులర్ బెయిల్ లభించడంతో చంద్రబాబుతో పాటు కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు ఆనందిస్తున్నారు.
Read More chandrababu naidu: ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్, విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
అయితే చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సిఐడి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తీవ్ర అవినీతి ఆరోపణలున్న వ్యక్తి బయట వుంటే కేసును ప్రభావితం చేస్తాడని సిఐడి అంటోంది. తమవద్ద చంద్రబాబు అవినీతికి సంబంధించిన ఆధారాలన్నీ వున్నాయని... వీటిని సుప్రీంకోర్టు ముందుంచి బెయిల్ రద్దు చేసి కస్టడీకి అప్పగించాలని కోరనున్నట్లు సిఐడి అధికారులు చెబుతున్నారు.
ఇదిలావుంటే ఇవాళ ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై నమోదయిన లిక్కర్ కేసు విచారణ జరిగింది. ఈ లిక్కర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం కేసును పాస్ ఓవర్ చేసింది. దీంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ కేసుపై వాదనలు తిరిగి ప్రారంభంకానుంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ తో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు విచారించనుంది.