అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం బుధవారం నాడు జరగనుంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ ఏర్పాటుతో పాటు రాజధాని అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఇవాళ ఉదయం పదిన్నరకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.

ఏపీ సీఎం ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నందున కేబినెట్ సమావేశాన్ని ఉదయం పదిన్నరకు ప్రారంభం కానుంది. ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాలపై కూడ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. 

ఒకటి నుంచి పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్ బ్యాగ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు.ఈ విషయమై కేబినెట్ లో చర్చించనున్నారు. మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇచ్చే అంశంపై కూడ చర్చ జరిగే అవకాశం ఉంది.

ఎర్ర చందనం కేసుల విచారణ కోసం తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన ర్యాలీలపై నమోదైన కేసులను రద్దు చేసే అంశంపై కెబినెట్టులో చర్చించనున్నారు.

ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై కేబినెట్ లో చర్చించనున్నారు. మన్సిపల్ ఎన్నికల ప్రక్రియను 27 రోజుల నుంచి 20 రోజులకు కుదించే ప్రతిపాదనపైనా చర్చించనున్న మంత్రివర్గం.

ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ ముసాయిదా బిల్లు ఆమోదంపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ ద్వారా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.