అమరావతి: వివిధ అంశాలపై చర్చించడమే కాకుండా పలు బిల్లుల ఆమోదానికి ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ లో మంత్రిమండలి భేటీకానుంది. 

ఈ కేబినెట్ భేటీలో ఇసుక కొత్త పాలసీపై చర్చించనున్నారు. కొత్త ఇసుక పాలసీపై ఇప్పటికే ప్రజాభిప్రాయాలను స్వీకరించగా ఇవాళ కెబినెట్‌ ఆమోదించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీలో ఆమోదించాల్సిన బిల్లులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. నవంబర్‌ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం ఈ కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనుంది. 

దిశా బిల్లు, అసైన్డ్‌ భూముల లీజు బిల్లులపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టంపై రూపొందించిన అంచనాలను అధికారులు కెబినెట్‌ ముందు ఉంచనున్నారు. సుమారు రూ. 10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందంటున్న ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు భూములను కేటాయింపుపై కెబినెట్‌ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. 

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వాటి నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టారు. వివిధ జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం క్షేత్ర స్థాయిలో పర్యటించిన డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్థలాలను కూడా పరిశీలించారు. 

బందరు పోర్టు పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ కెబినెట్ లో చర్చకు వచ్చే అవకాశాలున్నారు. ఇలా కీలకమైన అంశాలపై జగన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఇవాళ చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.