కాంగ్రెస్ లో కార్పోరేట్ స్టైల్ ... ఆ నాయకులను ఇంటర్వ్యూ చేసిన షర్మిల, ఎందుకో తెలుసా?
కార్పోరేట్ కంపనీలు ఉద్యోగుల ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తుంటాయి... ఇదే పద్దతిని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అనుసరిస్తోంది. అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న నాయకులకు తాజాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల.
విజయవాడ : వైఎస్ షర్మిల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ జోష్ పెరిగింది. ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏపీలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ షర్మిల ఎంట్రీతో కాస్త మెరుగుపడినట్లు కనిపిస్తోంది. సొంత సోదరుడని కూడా చూడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆమె చేస్తున్న పోరాటం, పార్టీని బలోపేతం చేయడానికి చూపిస్తున్న కమిట్ మెంట్ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోంది. ఈ క్రమంలోనే గెలుపుపై ఆశలు చిగురించడంతో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్న ఏపిసిసి అధ్యక్షురాలు ఎంపిక ప్రక్రియను సరికొత్తగా చేపట్టారు.
కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నాయకుల నుండి ఇప్పటికే ఏపిసిసి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీకి చాలామంది కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు... వారిలో సరైన అభ్యర్థిని ఎంపికచేసే ప్రక్రియను వైఎస్ షర్మిల ప్రారంభించారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తాజా షర్మిల ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆశావహులతో సుధీర్ఘంగా చర్చిస్తున్న షర్మిల వారు చెప్పే విషయాలను నోట్ చేసుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూ ఆదారంగానే కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు వుంటుందని ఆ పార్టీ వర్గాల సమాచారం.
కాంగ్రెస్ టికెట్ ఆశావహులు ఇంటర్వ్యూ నిన్న(బుధవారం) ప్రారంభమయ్యింది. ఇది ఇవాళ (గురువారం) కూడా కొనసాగనుంది. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో ఈ ముఖాముఖి సాగుతోంది. నిన్నంతా నరసాపురం, నరసరావుపేట, ఏలూరు, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఇంటర్వ్యూ నిర్వహించారు. మొత్తం 49 అసెంబ్లీ స్థానాలకుగాను 280 మంది దరఖాస్తు చేసుకోగా వారందరితో షర్మిల చర్చించారు. ఒక్కొక్కరినీ ఇంటర్వ్యూ చేయడంతో చాలా సమయం పట్టింది... దీంతో రాత్రి ఒంటిగంట వరకు షర్మిల కాంగ్రెస్ కార్యాలయంలోనే వున్నారు. ఆశావహులు, వారి అనుచరులతో ఆంధ్రరత్న భవన్ లో అర్థరాత్రి వరకు కోలాహలం నెలకొంది.
వీడియో
ఇక ఇవాళ(గురువారం) కూడా కాంగ్రెస్ టికెట్ ఆశావహుల ఇంటర్వ్యూలు కొనసాగనున్నాయి. మిగతా లోక్ సభ నియోజకగర్గాల పరిధిలోని అసెంబ్లీల వారిగా ఆశావహులతో షర్మిల మాట్లాడనున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు గెలుపు కోసం ఎంత సీరియస్ గా పనిచేస్తారో తెలుసుకోనున్నారు. కాబట్టి ఇవాళ కూడా అర్థరాత్రి వరకు ఈ ఇంటర్వ్యూలు కొనసాగే అవకాశం వుంది.
Also Read ఇక మీ ఖర్మ... నేనేమీ చేయలేను..: పవన్, చంద్రబాబుకు జోగయ్య ఘాటు లేఖ
ఇదిలావుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం సక్సెస్ కావడంతో దాన్నే ఫాలో అవుతోంది ఏపీ కాంగ్రెస్. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గేతో ఏపీలోని ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేల ఆర్థిక సాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఇక త్వరలోనే ఏపీకి ప్రత్యేక హోదాపై కూడా మరో డిక్లరేషన్ ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది. ఇలా గ్యారంటీలు, డిక్లరేషన్ల పేరిట హామీలు ఇచ్చి తెలంగాణలో మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.