Andhra pradesh: అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన గూగుల్ క్లౌడ్ ర్యాపిడ్ ఏజెంట్ హ్యాకథాన్ (ఎలాస్టిక్ ట్రాక్) పోటీలో చిత్తూరులోని ది అపోలో యూనివర్సిటీ విద్యార్థి వినయ్ విశేష ప్రతిభ కనబరిచారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడిన ప్రతిభావంతుల మధ్య తన వినూత్న ఏఐ ప్రాజెక్ట్‌తో తొలి స్థానాన్నిఅందుకున్నారు.
అత్యవసర వైద్య సేవల కోసం 'క్రైసిస్‌రూట్ ఏఐ' ప్రాజెక్ట్
ఈ వినూత్న ఏఐ ప్రాజెక్ట్‌తో విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. ఈ విజయానికి గుర్తింపుగా ఆయనకు 5,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.4.30 లక్షలు) నగదు బహుమతి లభించింది. వినయ్ రూపొందించిన 'క్రైసిస్‌రూట్ ఏఐ' ప్రాజెక్ట్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను అత్యంత వేగంగా సరైన ఆసుపత్రికి తరలించే విధంగా రూపొందించారు. కృత్రిమ మేథ (ఏఐ) ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ రోగి పరిస్థితి, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, సమీపంలోని ఆసుపత్రులు, ప్రయాణ సమయం వంటి అంశాలను విశ్లేషించి వేగవంతమైన నిర్ణయాలను తీసుకునేలా రూపొందించారు. దీని ద్వారా చికిత్స ఆలస్యం తగ్గి అత్యవసర వైద్య సేవల సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని విశ్వవిద్యాలయం తెలిపింది.
పరిశోధన, ఆవిష్కరణలకు అపోలో యూనివర్సిటీ ప్రాధాన్యం
ఈ విజయంపై స్పందించిన వైస్ ఛాన్సలర్ డాక్టర్ నితిన్ ఎం. నాగార్కర్ విద్యార్థి వినయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ది అపోలో యూనివర్సిటీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రపంచ స్థాయి పోటీల్లో విద్యార్థులు విజయాలు సాధించడం విశ్వవిద్యాలయ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని, ఇటువంటి విజయాలు అంతర్జాతీయ ప్లాట్ ఫామ్స్ పై యూనివర్సిటీ ప్రతిష్ఠను మరింత పెంచుతాయని పేర్కొన్నారు.
నాణ్యమైన విద్యకు నిదర్శనమని అధ్యాపకుల అభిప్రాయం
బయోమెడికల్ సైన్సెస్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్. సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ విజయం విశ్వవిద్యాలయంలో అందిస్తున్న నాణ్యమైన విద్య, పరిశోధన, ఆచరణాత్మక శిక్షణకు నిదర్శనమని తెలిపారు. వాస్తవ ఆరోగ్య సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందించే దిశగా విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలను ప్రోత్సహించడమే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు.
విద్యార్థి విజయాన్ని అభినందించిన యూనివర్సిటీ యాజమాన్యం
ఈ సందర్భంగా ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆల్ఫ్రెడ్ జె. ఆగస్టీన్, రిజిస్ట్రార్ ఎస్. అనిల్ కుమార్ వినయ్‌ను అభినందించి భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. గోపీకృష్ణ, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్. శ్రీరూప్ రెడ్డి పాల్గొని విద్యార్థి ప్రతిభను ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీకి గుర్తింపు తీసుకొచ్చిన వినయ్‌కు యాజమాన్యం శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఆవిష్కరణలతో దేశానికి, సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించింది.


