కర్నూలు: ఓ వ్యక్తి తన భార్యాపిల్లలను ఐదు లక్షల రూపాయలకు అమ్మిన సంఘటన కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించింది. కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో ఓ వ్యక్తి తన భార్యను, నలుగురు పిల్లలను తన అన్నకే విక్రయించాడు. 

నంద్యాలకు చెందిన వెంకటమ్మ (35) కోయిలకుంట్లకు చెందిన పసుపులేటి మద్దిలేటి (38)ని వివాహం చేసుకుంది. వారికి నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో మద్దిలేటి జూదానికి, మద్యానికి బానిసయ్యాడు. దాంతో అప్పుల పాలయ్యాడు. 

అప్పుల భారంతో ప్రస్తుతం 17 ఏళ్ల వయస్సు ఉన్న తన కూతురిని రూ.1.5 లక్షలకు తన సమీప బంధువుకు విక్రయించడానికి నిరుడు పూనుకున్నాడు. మద్దిలేటి ఆ డబ్బును మంచినీళ్ల ప్రాయంలో ఖర్చు చేశాడు. 

దాంతో తన భార్యను, మిగతా నలుగురు పిల్లలను ఐదు లక్షల రూపాయలకు విక్రయించడానికి తన అన్న బుసితో ఒప్పందం కుదుర్చుకున్ాడు. ముగ్గురు కూతుళ్లను, కుమారుడిని, భార్యను విక్రయించడానికి పూనుకున్నాడు. 

ఒప్పందం చేసుకునే సమయంలో బుసి మద్దిలేటి భార్య అంగీకారం కావాలని అడిగాడు. ఆ విషయం చెప్పడంతో భార్య వెంకటమ్మ నిరాకరించింది. దాంతో ఆమెను చిత్రహింసలు పెట్టాడు. నంద్యాలలోని తన పుట్టింటికి పారిపోయింది. 

నలుగురు పిల్లలతో సహా వెంకటమ్మ బావ నుంచి తప్పించుకుని పారిపోయింది. వెంకటమ్మ తల్లిదండ్రులు నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐసిడిఎస్ అధికారులు ఇద్దరు పెద్దమ్మాయిలను రక్షించి స్టేట్ హోమ్ కు పంపించారు. 

మద్దిలేటి బుడగ జంగాలు సామాజిక వర్గానికి చెందినవాడు. ఈ కమ్యూనిటీలో భార్యలను విక్రయించడం, కొనడం అనేది సంప్రదాయంగా వస్తోందని అంటున్నారు.