సింగపూర్ కు తెలుగు వర్షనే అయినా అమరావతి రాజధానిలో వాడేది ఆంధ్రా గ్రనైటే...
ఇది నిజంగా శుభవార్తే...
తెలుగువాళ్లంతా, ముఖ్యంగా ఆంధ్రోళ్లంతా చప్పట్టుకోట్టాల్సిన సమయం.
సింగపూర్ కు తెలుగు ట్రాన్స్ లేషన్ అమరావతి అని అనుకుంటున్నారా, అనుకోండి.
అమరావతి డిజైన్,కాన్సెప్ట్ తయారు చేసింది సింగపూర్ వాళ్లే కావచ్చు.
ముఖ్యమంత్రి నాయుడు, ఆయన అస్థాన పండితులు సింగపూర్ కెళ్లి అమరావతి రాజ్యాన్ని ఎలా పాలించాలో మెలకువలునేర్చకుని ఉండవచ్చు. అమరావతి వంటకి మసాలా దినుసులను సప్లయిచేసేందుకు చైనా,కజఖ్ స్తాన్, మలేషియా,దుబాయ్, బ్రెజిల్ దేశాలు ముందుకొచ్చి వుండవచ్చు.వీళ్లకి తోడుగా మేమూ తలా ఒక రూక అందిస్తామని ఇంగ్లండు, రష్యా దేశాలు అసక్తి చూపి ఉండవచ్చు.
అయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పుత్రుడే (సన్ అప్ ది సాయిల్) నని రుజువు చేసుకున్నారు.ఆయన తన రాష్ట్ర భక్తిని చక్కగా ప్రదర్శించారు.
అమరావతి ఎవరు కడితే ఏముంది, ఎవరు కాంట్రాక్టర్లయితే మనకెందుకు, ఎవరి ప్లాన్అయినా ఒకటే... అమరావతిని నిలబెట్టేది ఆంధ్రయే. ఎలాగంటే, అమరావతి నగర నిర్మాణంలో వాడే గ్రనైట్ ఆంధ్రదే. ఈ విషయంలో రాజీ లేదని నీళ్లు నమలకుండా ఆయన స్వయంగా ప్రకటించేశారు.
వరల్డ్ క్లాస్ రాజధాని అమరావతి నిర్మాణంలో రాష్ట్ర గ్రానైట్‌నే వినియోగిస్తామని ముఖ్యమంత్రి గ్రానైట్ పరిశ్రమల యజమానులకు భరోసా కూడా ఇచ్చారు.
అమరావతి నిర్మాణంలో గ్రానైట్, క్వారీ యజమానులు కీలక పాత్ర పోషించి చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోండని ఆయన వారికి పిలుపునిచ్చారు. వెలగపూడి సచివాలయంలో ‘ఫెడరేషన్ ఆఫ్ ఏపీ గ్రానైట్ ఇండస్ట్రీ, ‘ది ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్’ ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.
గ్రానైట్ క్వారీల్లో అక్రమాలకు తావులేకుండా అవసరమైతే డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకుంటామన్నారు. చంద్రబాబు ఈ విషయం ప్రకటించడంతో గ్రనైట్ ప్రతినిధులు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారని ప్రభుత్వం వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
