Asianet News TeluguAsianet News Telugu

ప్రత్యేక హోదా కోసం ఏపీలో వైసీపీ బంద్: ఎక్కడికక్కడ అరెస్టులు

 ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నాడు బంద్ కొనసాగుతోంది.  వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో  బంద్‌ నిర్వహిస్తున్నారు.

Andhra Bandh: YSRCP Holds Protest Amid Tight Security

అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నాడు బంద్ కొనసాగుతోంది.  వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో  బంద్‌ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులను, నేతలను పోలీసులు ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు. 

మంగళవారం తెల్లవారుజాము నుండే  ఆర్టీసీ బస్ డిపోల వద్ద  వైసీపీ కార్యకర్తలు  ఆందోళన కొనసాగించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకొన్నారు. విద్యాసంస్థలు, వాణిజ్యసంస్థలు మూతపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బంద్ నిర్వహిస్తున్న  వైసీపీ కార్యకర్తలు,నేతలను  పోలీసులు  అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరులో బంద్‌లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యేలు  రోజా, నారాయణస్వామిలను పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల  ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు.  

గుంటూరు జల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో  వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నేతృత్వంలో వైసీపీ నేతలు  బంద్ నిర్వహించారు.  అయితే ముందుజాగ్రత్తగా అంబటి రాంబాబును  పోలీసులు అరెస్ట్ చేశారు.  నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కూడ అరెస్ట్ చేశారు.

గుంటూరులో బస్సులను అడ్డుకున్న ఎమ్మెల్యే ముస్తఫా, మేరుగ నాగార్జున, ఎల్.అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, శ్రీకృష్ణదేవరాయలు, కిలారు రోశయ్యల, రేపల్లెలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. 

అనంతపురం జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. టీడీపీ, బీజేపీ మోసాలను నిరసిస్తూ పెనుకొండ సమన్వయ కర్త శంకర్ నారాయణ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. 

విజయనగరం జిల్లాలో బంద్‌లో పాల్గొన్న  ఎమ్మెల్సీ కోలగట్ల వీర భద్రస్వామి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. 

ఆర్టీసీ బస్సులను వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.  విశాఖ జిల్లాలోని పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.  పోలీసులు ముందుజాగ్రత్తగా  వారిని అదుపులోకి తీసుకొన్నారు. 

వైఎస్సార్ జిల్లా పులివెందుల బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపో ముందు పలాస వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు ధర్నాలో పాల్గొన్నారు. విజయవాడలో ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేసిన వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధ, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్టీసీ డిపో నుండి బస్సులు బయటకు రాకుండా వైఎస్సార్‌సీపీ ఇంచర్జి చెరుకులపాడు శ్రీదేవి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు బి.వై. రామయ్య అరెస్ట్‌కు నిరసనగా పీఎస్ ముందు వైసిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios