ఉత్కంఠ: కాసేపట్లో బాబుతో జేసీ భేటీ, ఏం జరుగుతోంది?

Ananatpuram MP JC Diwakar Reddy trying to meet Ap Cm Chandrababunaidu
Highlights

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును  కలిసేందుకు సెక్రటేరియట్‌కు వచ్చారు. అనంతపురం జిల్లాలో చోటు చేసుకొన్న పరిణామల నేపథ్యంలో పార్లమెంట్‌కు హాజరుకాబోనని ప్రకటించారు

అమరావతి: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును  కలిసేందుకు సెక్రటేరియట్‌కు వచ్చారు. అనంతపురం జిల్లాలో చోటు చేసుకొన్న పరిణామల నేపథ్యంలో పార్లమెంట్‌కు హాజరుకాబోనని ప్రకటించారు. ఆ తర్వాత ఎంపీ పదవికి కూడ రాజీనామా  చేస్తానని ఆయన ప్రకటించారు.  ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫోన్‌ చేయడంతో  పార్లమెంట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో  బాబును కలిసేందుకు జేసీ దివాకర్ రెడ్డి రావడం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకొంది.

పార్లమెంట్‌లో అవిశ్వాసంపై ఓటింగ్‌ పూర్తైన తర్వాత  ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు  జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు.అయితే చంద్రబాబునాయుడు సూచన మేరకు జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గినట్టు సమాచారం.ఈ విషయమై బాబుతో చర్చించేందుకు సోమవారం నాడు ఆయన అమరావతికి వచ్చారు.


పార్లమెంట్‌లో అవిశ్వాసం ముగిసిన తర్వాత శనివారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి అవిశ్వాసానికి ధన్యవాదాలు తెలిపిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీలతో బాబు సమావేశమయ్యారు.ఈ సమావేశం ముగిసిన  తర్వాత  జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబునాయుడుతో  సమావేశమయ్యారు. 

ఈ సమావేశానికి కొనసాగింపుగానే  జేసీ దివాకర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసేందుకు సోమవారం నాడు అమరావతికి వచ్చారని సమాచారం.  ఢిల్లీలో మాట్లాడేందుకు సమయం లేని కారణంగానే అమరావతికి రావాలని జేసీని చంద్రబాబునాయుడు ఆహ్వానించారని అంటున్నారు.

ఇదిలా ఉంటే  అనంతపురం జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై  జేసీ దివాకర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నాయకత్వం కూడ తనను నిర్లక్ష్యం చేస్తోందనే భావనతో దివాకర్ రెడ్డి ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.  మరో వైపు అనంతపురం పట్టణంలో రోడ్ల విస్తరణతో పాటు మాజీ ఎమ్యెల్యేలను పార్టీలోకి చేర్చుకొనే విషయమై  దివాకర్ రెడ్డి  పార్టీ నాయకత్వంపై కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

ఈ విషయాలపై చంద్రబాబుతో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో బాబుతో దివాకర్ రెడ్డి భేటీ రాజకీయంగా  ప్రాధాన్యత సంతరించుకొంది.

loader